Shreyas Iyer : కోల్ కతా జట్టు అంటిపెట్టుకోకపోవడంతో ఐపీఎల్లో అయ్యర్ కెరియర్ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అతడు ఆందోళనలో కూరుకుపోయాడు. భవిష్యత్తు ఎలా? అనే డోలాయమానంలో పడిపోయాడు. ఈ క్రమంలో అతడు ఏ జట్టుకు ఆడుతాడు? అతడిని ఏ జట్టు తీసుకుంటుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్చ జరుగుతుండగానే జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వాటి ద్వారా ఒక కీలకమైన అప్డేట్ బయటికి వచ్చింది. అయ్యర్ వచ్చే ఐపిఎల్ సీజన్లో ఢిల్లీ జట్టు తరఫున ఆడతాడని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ యాజమాన్యం అతడితో సంప్రదింపులు జరిపిందని తెలుస్తోంది. ” ఢిల్లీ జట్టు నుంచి పంత్ బయటకు వెళ్లిపోయాడు. అతడి స్థానంలో అయ్యర్ ను కచ్చితంగా తీసుకుంటారు. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఐపీఎల్ సీజన్లో అయ్యర్ ఢిల్లీ కెప్టెన్ గా కనిపిస్తాడు. కోల్ కతా జట్టును నడిపించినట్టుగానే.. ఢిల్లీ జట్టును కూడా నడిపిస్తాడు. అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని నమ్మకం ఉందని” జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
73 కోట్లతో..
ప్రస్తుతం ఢిల్లీ జట్టు దగ్గర 73 కోట్ల పర్స్ వేల్యూ ఉంది. ఆ డబ్బులలో సింహ భాగాన్ని అయ్యర్ కోసం ఖర్చు పెట్టాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ జట్టు సహాయజమాని జిఎంఆర్ గ్రూప్ అతనితో సంప్రదింపులు జరిపింది. ” 2024 సీజన్లో కోల్ కతా అయ్యర్ ఆధ్వర్యంలో విన్నర్ అయ్యింది. ఈ సీజన్ కు వచ్చేసరికి అయ్యర్, కోల్ కతా యాజమాన్యం మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒక ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరలేదు. అందువల్లే అతడిని యాజమాన్యం అంటి పెట్టుకోలేదు. దీంతో అతడు బయటికి వెళ్లడం ఖాయం అయిపోయిందని” కోల్ కతా జట్టు సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నాడు. ” రి టెన్షన్ లో అతడిని ఉంచుకోవాలని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. మన చేతిలో ఏమీ లేనప్పుడు.. మిగతా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే ఉత్తమం. అయ్యర్ విషయంలోనూ అదే జరిగింది. తర్వాత ఏం జరుగుతుందనేది కాలమే చెబుతుందని” వెంకీ మైసూర్ వ్యాఖ్యానించాడు. కాగా, వెంకీ మైసూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీస్తున్నాయి.. కాగా, వచ్చే సీజన్లో ఢిల్లీ జట్టుకు అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. ఇది దాదాపుగా ఖాయం అయింది. అయితే అతడి కోసం ఢిల్లీ జట్టు ఎంత ఖర్చు చేస్తుందనేది ఇప్పటివరకు బయటకి తెలియ రాలేదు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అతడికి భారీగానే నగదు లభించే అవకాశం కల్పిస్తోంది. క్లాసెన్ రికార్డును అతడు బద్దలు కొడతాడని స్పోర్ట్స్ వర్గాలు భావిస్తున్నాయి.