Delhi Capitals Vs Mumbai Indians Match Highlights: ఢిల్లీ జట్టుతో మ్యాచ్ ప్రారంభానికి ముందు అందరి అంచనాలు దాదాపు ఒకేవిధంగా ఉన్నాయి. కచ్చితంగా ముంబై గెలుస్తుందని.. ఢిల్లీ దారుణమైన ఓటమిని మూట కట్టుకుంటుందని.. కామెంట్రీ చేసే వాళ్ళు కూడా చెప్పేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తక్కువలో తక్కువ 250 పరుగులు చేస్తుందని ఒక అంచనాకొచ్చారు.
అందరి అంచనాలకు తగ్గట్టుగానే ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ.. రికెల్టన్ తొలి 3 ఓవర్లలో బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో 250 ప్లస్ స్కోర్ సాధ్యమవుతుందని ముంబై అభిమానులు భావించారు. అదిగో ఆ తర్వాత మ్యాజిక్ మొదలైంది. ముఖేష్ తన ఓవర్లో రికెల్టన్.. తిలక్ వర్మ వికెట్లు పడగొట్టాడు. ఇక అప్పటినుంచి మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు రావడం మొదలుపెట్టింది. ఏ దశలో ముంబై జట్టు ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ వ్యవహరించాడు. బౌలింగ్లో పూర్తిస్థాయిలో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. కులదీప్ యాదవ్ మినహా.. మిగతా వారంతా అద్భుతంగా బౌలింగ్ చేశారు. 250 కి మించి పరుగులు చేస్తారు అనుకుంటున్న దశ నుంచి.. 164 వరకే ఆపేశారు.
మధ్యస్థ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఢిల్లీ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. భారీగా అంచనాలు పెట్టుకున్న కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు.. నితిష్ రాణా సున్నా చుట్టాడు.. నిస్సాంక(44), సమీర్ రిజ్వి (90) దూకుడుగా బ్యాటింగ్ చేశారు. అప్పటికే ఢిల్లీ విజయం ఖాయమైంది. చివర్లో మిల్లర్(21*), స్టబ్స్(3*) అదరగొట్టడంతో 18.1 ఓవర్లలో ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని సాధించింది. మొత్తంగా ఆరు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. ప్రస్తుత ఐపీఎల్ లో వరుసగా రెండో విజయం సాధించి ఢిల్లీ జట్టు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
ఢిల్లీ జట్టులో కెప్టెన్ అక్షర్ బౌలింగ్లో సరికొత్త ప్రయోగాలు చేశాడు. యువ బౌలర్లను ఎక్కువగా వాడుకున్నాడు. మైదానం గురించి అతనికి సంపూర్ణమైన అవగాహన ఉండడంతో టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి 3 ఓవర్లలో ముంబై ఆటగాళ్లు అదరగొట్టినప్పటికీ.. ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. చేజింగ్ లో కూడా ఢిల్లీ జట్టు ప్రారంభంలో ఇబ్బంది పడినప్పటికీ.. సమీర్ రిజ్వి వల్ల మరో 11 బం తులు మిగిలి ఉండగానే.. విజయాన్ని అందుకుంది.
