BCCI Sensational Decision: అండర్ 19 ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దాయాది దేశం చేతిలో ఓడిపోవడం సగటు భారత అభిమానికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. పాకిస్తాన్ చేతిలో ఇటీవల కాలంలో అండర్ 19 భారత జట్టు ఓడిపోవడం ఇది రెండవసారి. మొదటి ఓటమిని ఏదో దురదృష్టవశాత్తు జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ రెండవసారి, అది కూడా భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడం ఏమాత్రం సహేతుకంగా లేదు.
ఆసియా కప్ లో ఆయుష్ నాయకత్వంలో టీమిండియా అద్భుతంగా ఆడింది. వరుసగా అన్ని మ్యాచ్లు గెలిచింది. కానీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా 191 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిని బీసీసీఐ ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అంతేకాదు అండర్-19 జట్టు ప్రదర్శన పట్ల సోమవారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆన్లైన్లో జరిగిన మీటింగ్లో బోర్డు పెద్దలు తీవ్రంగా స్పందించారు. జట్టు ఆట తీరుపట్ల కచ్చితంగా సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కానీ అతడు ఔట్టిన తర్వాత మిగతా బ్యాటర్లు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. పాకిస్తాన్ బౌలర్ల ముందు తలవంచారు.
అండర్ 19 జట్టులో మార్పులు కచ్చితంగా కావాలని.. తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని బోర్డు పెద్దలు అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోవడం బోర్డు పెద్దలను తీవ్రమైన కలతకు గురి చేస్తోంది. అందువల్లే జట్టు ఆట తీరు పట్ల సమీక్ష అవసరమని బోర్డు పెద్దలు ప్రతిపాదించారు. దీనికి తోడు జనవరిలో అండర్ 19 ప్రపంచకప్ మొదలవుతుంది. అందువల్లే బోర్డు పెద్దలు ఆసియా కప్ ను ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదు. ప్లేయర్లు తమ లోపాలను సవరించుకోవాలని బోర్డు పెద్దలు పదే పదే చెప్పినట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో జరిగిన ఈ మీటింగ్ కు కెప్టెన్ ఆయుష్, కోచ్ హృషికేష్ హాజరయ్యారు.
మరోవైపు ఫైనల్ మ్యాచ్లో వైభవ్, ఆయుష్ హద్దులు దాటారు. పాకిస్తాన్ ప్లేయర్ అలీ బౌలింగ్లో వీరిద్దరూ అవుట్ అయ్యారు. అవుట్ అయిన తర్వాత ఆయుష్, వైభవ్ పాకిస్తాన్ బౌలర్ పై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. దీనిపై ఐసీసీ ఆయుష్, ప్రధాన కోచ్ వివరణ కోరేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఐసీసీ కి ఫిర్యాదు చేస్తామని పిసిబి చీఫ్ నక్వీ ప్రకటించారు.