CSK performance : ఐపీఎల్ లో చెన్నై జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జట్టు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీలు అందుకుంది. ముంబై జట్టుతో సమానంగా నిలబడింది. ఆ స్థాయిలో ఆటతీరు కొనసాగించిన చెన్నై జట్టు.. కొంతకాలంగా సరిగ్గా ఆడటం లేదు. సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. భారీగా పరుగులు చేయడంలో.. వికెట్లను తీయడంలో.. మైదానంలో గెలుపు సాధించే విధంగా లక్ష్యాలను రూపొందించడంలో విఫలమవుతోంది.
గత ఏడాది చెన్నై జట్టు సారథి గైక్వాడ్ గాయపడ్డాడు. ఈ దశలో ధోని తాత్కాలిక సారధిగా నియమితుడయ్యాడు. అతడి నాయకత్వంలో కూడా చెన్నై జట్టు విజయాలు సాధించలేకపోయింది. ఆటగాళ్ల ఆట తీరు చూసిన చెన్నై జట్టు తాత్కాలిక సారధి ధోని ఒక రకమైన నిర్వేదం వ్యక్తం చేశాడు. ఇటువంటి ఆటగాళ్లతో ట్రోఫీలు ఎలా గెలుస్తామని తన ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టులో ఆటగాళ్లు మారకపోతే ఇటువంటి ఓటమిలో వరసగా కాదు.. ప్రతి సీజన్లోనూ ఎదురవుతుంటాయని ధోని పేర్కొన్నాడు. దీనిని బట్టి గత ఏడాది చెన్నై జట్టు ఆట ఎలా సాగింది అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది జరిగిన మెగా వేలంలో కొంతమంది ప్లేయర్లను చెన్నై జట్టు కొనుగోలు చేసింది. వారంతా కూడా బ్యాటింగ్.. బౌలింగ్ సమర్థవంతంగా చేయగల ప్లేయర్లు. అయితే ఇప్పటి సీజన్లో వారిలో కొంతమంది అంతగా ఆకట్టుకోవడం లేదు. కొంతమంది మాత్రం దూకుడుగా ఆడుతున్నారు. అటువంటి వారిలో ఆయుష్ మాత్రే ముందు వరుసలో ఉంటాడు. ఇటీవల చెన్నై జట్టు రెండు విజయాలు సాధించింది. అందులో ఆయుష్ పాత్ర కీలకం.
శనివారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆయుష్ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. ఇప్పటికే చెన్నై జట్టు ప్లేయర్లలో ఎల్లిస్, ధోని, ఖలీల్ గాయపడ్డారు. ఆ జాబితాలో ఆయుష్ కూడా చేరిపోయాడు. అయితే అతడికి అయిన గాయం తీవ్రమైనదని తెలుస్తోంది. అతడు ఇప్పట్లో కోలుకుంటాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఆయుష్ గాయంపై చెన్నై జట్టు కోచ్ హస్సీ స్పందించాడు. ” తొడ కండరాలలో చీలిక రాయడం వల్ల ఈ గాయం ఏర్పడింది. స్కాన్ చేయాల్సి ఉంది. వచ్చిన ఫలితం ఆధారంగా అతని భవితవ్యం ఆధారపడి ఉంటుంది. దురదృష్టవశాత్తు అతని పరిస్థితి అంత గొప్పగా కనిపించడం లేదని” హస్సి పేర్కొన్నాడు. కొన్ని మ్యాచ్లకు అతడు దూరం అవుతాడని.. అతడి గాయం ఇప్పట్లో నయమయ్యే అవకాశం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే దీనిపై చెన్నై మేనేజ్మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.