Shivam Dube : నువ్వు ధోని శిష్యుడివా? ఇలానేనా ఆడేది?

ఐపీఎల్ లో శివం అద్భుతంగా ఆడాడు. బిసిసిఐ సెలెక్టర్ల మనసును దోచుకున్నాడు.

Written By: NARESH, Updated On : June 10, 2024 10:28 pm

shivam dube

Follow us on

Shivam Dube : ఆదివారం రాత్రి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ధోని శిష్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు శివం దూబే క్యాచ్ జారవిడవడంతో నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా వేసిన బంతిని రిజ్వాన్ క్రాస్ ఆడాడు. అతడి కొట్టిన వేగానికి బంతి డీప్ ఫైన్ లెగ్ లోకి వెళ్ళింది. అక్కడ శివం దూబే ఫీల్డ్ లో ఉన్నాడు. సునాయసమైన క్యాచ్ చేతుల్లోకి వచ్చినప్పటికీ.. జారవిడిచాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు అతనిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

దూబేకు బదులు అభిషేక్ శర్మను తీసుకుంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. శివం కు ఆట మీద ఆసక్తి లేదని, అతడి కంటే రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసిన యశస్వి జైస్వాల్ ను ఆడించాల్సిందని హితవు పలుకుతున్నారు. “ధోని శిష్యుడిగా ఇలా ఆడితే ఎలా? అతడికి ఉన్న మంచి పేరును చెడగొడుతున్నావ్? ఆట మీద ఆసక్తి లేకుంటే ముందే చెప్పాలి కదా. ఇలా పరధ్యానంలో ఉండి ఫీల్డింగ్ చేస్తే ఎలా? ఇదేమన్నా గల్లి క్రికెట్ అనుకున్నావా? పాక్ జట్టుతో ఆడుతున్నప్పుడు ఎలా అలెర్ట్ గా ఉండాలో తెలియదా?” అంటూ నెటిజన్లు శివం దూబేను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.

రిజ్వాన్ క్యాచ్ ను శివం దుబే జార విడిచినప్పటికీ.. మరి కొంతసేపటికే బుమ్రా రిజ్వాన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు నిరాశతో వెనుతిరిగాడు. ఒకవేళ రిజ్వాన్ కనక అలా అవుట్ అయి ఉండకపోతే.. భారత జట్టు విజయావకాశాలను అతడు కచ్చితంగా దెబ్బ కొట్టేవాడు. దూబే క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ.. కొంతసేపటికే బుమ్రా ఔట్ చేయడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది.

ఐపీఎల్ లో శివం అద్భుతంగా ఆడాడు. బిసిసిఐ సెలెక్టర్ల మనసును దోచుకున్నాడు. అందువల్లే ఎంతో పోటీ ఉన్నప్పటికీ బీసీసీఐ శివం వైపు మొగ్గు చూపించింది. ఐపీఎల్లో మొత్తంగా 14 మ్యాచులు ఆడిన దూబే 396 పరుగులు చేశాడు. ఐపీఎల్ లీగ్ దశలోనే బీసీసీఐ టి20 వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసింది. కీలకమైన ఆటగాళ్లను పక్కనపెట్టి శివమ్ ను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వచ్చినప్పటికీ.. దాని వెనుక ఉన్న కారణాలను రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ వెల్లడించడంతో.. అందరి నోళ్ళూ మూతపడ్డాయి.