Coach beat Sehwag: టీమిండియా క్రికెట్ కు సరికొత్త సొబగులు అద్దిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. మాస్టర్ బ్యాటింగ్ ద్వారా సచిన్ టెండూల్కర్.. డేరింగ్ బ్యాటింగ్ ద్వారా గంగూలి.. దుందుడుకు నిర్ణయాల ద్వారా కపిల్ దేవ్.. మిస్టర్ కూల్ ఆట ద్వారా ధోని.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో రాహుల్ ద్రావిడ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ప్లేయర్లు టీమిండియా క్రికెట్ లో సరికొత్త చరిత్రను.. సరికొత్త రికార్డులను ఆవిష్కరించారు. అయితే ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ కు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఎందుకంటే అతని బ్యాటింగ్ స్టైల్ ఉపమానాలకు అందదు. కొలమానాలకు సరిపోలదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు బ్యాటింగ్ చేస్తాడు. బంతిని బలంగా కొడతాడు. బౌలర్ ఎవరనేది లెక్క పెట్టడు. అందువల్లే అతడిని టీమ్ ఇండియాలో సీతయ్య అని పిలుస్తుంటారు.
సీతయ్య మాదిరిగానే..
సీతయ్య మాదిరిగానే వీరేంద్రుడు ఎవరి మాటా వినడు. అతడి బ్యాటింగ్ కు ఫామ్ తో సంబంధం ఉండదు. మైదానంతో సంబంధం ఉండదు. బంతితో సంబంధం ఉండదు. బౌలర్ తో సంబంధం ఉండదు. అందువల్లే సుదీర్ఘ ఫార్మాట్లో త్రిబుల్ సెంచరీ చేయగలిగాడు. ఇప్పటికీ ఆ రికార్డును మరే టీమిండియా ఆటగాడు బద్దలు కొట్టడానికి ప్రయత్నించలేదు. ఇప్పట్లో బద్దలు కొట్టే అవకాశం కూడా లేదు. అలాగని రోజుల తరబడి క్రికెట్ ఆడలేదు. ప్రత్యర్థి బౌలర్లకు విసుగు తెప్పించలేదు. తన సహజ శైలి ఆట తీరుతోనే అద్భుత సృష్టించాడు. తను ఒక అద్భుతం లాగా మిగిలిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్ కు జట్టులో చోటు లభించినా.. లభించకపోయినా ఒకే తీరుగా ఉండేవాడు. ఎన్నడూ కూడా తనకు చోటు ఇవ్వాలని పైరవీలు చేయలేదు. తెర వెనుక రాజకీయాలు అంతకంటే చేయలేదు. ఆరంభంలో ఎలాగైతే ఉన్నాడో.. చివరి వరకు తన ఆటిట్యూడ్ అలాగే కొనసాగించాడు. అందువల్ల టీమిండియాలో వీరేంద్ర సెహ్వాగ్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
బిపి పెంచాడు
ముందుగానే చెప్పినట్టు వీరేంద్ర సెహ్వాగ్ కు ఆటిట్యూడ్ విపరీతంగా ఉంటుంది. అలాగని దాని ద్వారా ఇతరులను ఇబ్బందికి గురిచేయడు . కారణం ఏంటో తెలియదు గానీ వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో ఉన్నప్పుడు విదేశీకు కోచ్ లనే మేనేజ్మెంట్ తీసుకుంది. వారంటే వీరేంద్రుడికి ఏమాత్రం నచ్చేది కాదు. అలాగని బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించేవాడు కాదు. నెట్స్ లో తన సాధన తను చేసేవాడు. కోచ్ లు చెప్పేది అంతగా వినేవాడు కాదు. ఇది విదేశీ శిక్షకులకు నచ్చేది కాదు.
అప్పట్లో ఏం జరిగిందంటే..
అప్పట్లో వీరేంద్రుడి శైలి పట్ల చాపెల్ బహిరంగంగానే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అతడి తర్వాత జాన్ రైట్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ తీరు పట్ల మండిపడ్డాడు.. ఓ సందర్భంలో వీరేంద్ర సెహ్వాగ్ ను కొట్టాడని వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. సరదాగా కొట్టాడా.. కావాలని కొట్టాడా.. అనే విషయంపై క్లారిటీ లేదు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడూ చెప్పలేదు.. జాన్ రైట్ నోరు విప్పలేదు. కాకపోతే నాడు జరిగిన సంఘటనకు కొంతమంది ప్లేయర్లు సాక్షులుగా ఉన్నారు. బహుశా వారి వల్లే ఈ విషయం బయటపడి ఉండవచ్చు. టీమిండియాలో సీతయ్య మాదిరిగా ఉన్న వీరేంద్రుడిని కొట్టిన జాన్ రైట్ నిజంగానే తప్పు చేశాడా.. లేక కోచ్ మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలకు కారణమయ్యాడా.. ఈ విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఇటువంటి వార్తలే కావాలి. ఇటువంటివే జనాలకు కావాలి.