Indian cricket sponsors financial trouble: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బోర్డు.. అందువల్లే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రపంచ దేశాలలో విశిష్టమైన గుర్తింపు ఉంటుంది. భారత జట్టు తరఫున ఆడుతున్న ప్లేయర్లకు విపరీతమైన క్రేజీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ ఆడే ప్లేయర్లు ఏ స్థాయిలో అయితే సంపాదిస్తారో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తరఫున ఆడే ఆటగాళ్లు కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఆర్జిస్తుంటారు. అటువంటి వారికి ఇతర ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో లభిస్తుంటాయి..
ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర
ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేసింది కాబట్టి.. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో క్రికెట్ ఆడే టీమ్ ఇండియాకు స్పాన్సర్ గా ఉండేందుకు గొప్ప గొప్ప కంపెనీలు ముందుకు వస్తుంటాయి. ఇందులో ఎక్కువగా బహుళ జాతి సంస్థలే ఉండడం విశేషం. ఇవన్నీ కూడా కోట్లు కుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత తీరుగా భారత క్రికెట్ నియత్రణ మండలి కూడా స్పాన్సర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. పైగా ఏటికేడు స్పాన్సర్ షిప్ ఫీజును అమాంతం పెంచేస్తూ ఉంటుంది.. అయితే అంత ఫీజును సైతం చెల్లించడానికి కంపెనీలు ఏమాత్రం వెనకాడవు.. అయితే టీమిండియా కు స్పాన్సర్ చేసిన కంపెనీలు కొన్ని మునిగిపోవడం.. ఆర్థికంగా నష్టాలను ఎదుర్కోవడంతో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది.
విల్స్ కంపెనీ నుంచి మొదలు
19 93 నుంచి 2001 వరకు విల్స్ కంపెనీ భారత క్రికెట్ జట్టుకు అధికారిక స్పాన్సర్ గా ఉంది. ఈ కంపెనీ పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఈ కంపెనీ పై నిషేధం విధించడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పాన్సర్ జాబితా నుంచి తొలగించింది.. పైగా ఈ కంపెనీ కూడా ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2001 నుంచి 2013 వరకు టీమ్ ఇండియాకు సుబ్రతా రాయ్ కంపెనీ ప్రయోజక కర్తగా వ్యవహరించింది. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ సహారా కంపెనీ ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో.. స్పాన్సర్ బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంది. ఇప్పటివరకు సహారా కంపెనీ కోలుకోలేదు. ఇకపై కోలుకుంటుదనే నమ్మకం కూడా లేదు. 2014 నుంచి 2017 వరకు స్టార్ కంపెనీ ప్రయోజక కర్తగా ఉండేది. అయితే ఈ కంపెనీ మ్యాచ్ ప్రసార హక్కులను కోల్పోవడంతో స్పాన్సర్ నుంచి తప్పుకుంది. పైగా ఇప్పుడు స్టార్ కంపెనీ విలీనం అయింది. జియో , స్టార్ కంపెనీలు కలిసి పోయి జియో స్టార్ గా అవతరించాయి. 2017 నుంచి 2020 వరకు ఒప్పో టీమ్ ఇండియాకు స్పాన్సర్ గా ఉంది. అయితే చైనా ఉత్పత్తులను బహిష్కరించిన నేపథ్యంలో ఈ కంపెనీని స్పాన్సర్ హోదా నుంచి బిసిసిఐ తొలగించింది. 2020 నుంచి 2023 వరకు బైజుస్ కంపెనీ టీమ్ ఇండియాకు స్పాన్సర్ గా ఉంది. ఆర్థికంగా అవకతవకలు.. ఇతర నష్టాల వల్ల ఈ కంపెనీ స్వల్పకాలంలోనే స్పాన్సర్ హోదా నుంచి తప్పుకుంది. ఇక 2023 నుంచి 2025 వరకు డ్రీం 11 టీమ్ ఇండియాకు స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది. అయితే ఇది మరింత కాలం కొనసాగేదిగాని.. భారత దేశంలో ఆన్లైన్ గేమ్ యాప్ లపై ప్రభుత్వం నిషేధం విధించడంతో.. ఆ సంస్థ తన కార్యకలాపాలను పూర్తిగా రద్దు చేసింది.. ఒకరకంగా ఆ సంస్థ కూడా మూతపడింది.
ఆ నష్టాలకు బీసీసీఐకి ఏం సంబంధం
ఈ పరిణామాలను విశ్లేషకులు రకరకాలుగా చెబుతున్నారు. టీమ్ ఇండియాకు స్పాన్సర్ గా ఉండడంవల్లే ఈ కంపెనీలు మూతపడ్డాయని.. కొన్ని ఆర్థికంగా నష్టాలను చవి చూస్తున్నాయని వివరిస్తున్నారు. అయితే టీమిండియాకు స్పాన్సర్ గా ఉండడంవల్ల ఈ కంపెనీల విలువ పెరిగిపోయిందని.. అంతేతప్ప ఆర్థికంగా ఎదురయ్యే నష్టాలకు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి సంబంధం ఏంటి అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.