T20 World Cup: పొట్టి ఫార్మాట్లో పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు సాధించిన జట్టుకు విజయాలు దక్కడానికి అధికంగా ఆస్కారం ఉంటుంది. అందువల్లే అన్ని జట్లు పవర్ ప్లే లో సాధ్యమైనంతవరకు ఎక్కువ పరుగులు చేయడానికి తాపత్రయ పడుతుంటాయి. ఎందుకంటే పవర్ ప్లే లో ఫీల్డింగ్ విషయంలో నిబంధనలు ఉంటాయి. ఆ సమయంలో బ్యాటర్లకు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తూ ఉంటుంది.
మరి కొద్ది రోజుల్లో శ్రీలంక, భారత్ సంయుక్తంగా నిర్వహించే టి20 వరల్డ్ కప్ మొదలవుతుంది. టి20 వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అందుకోవడానికి ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2024లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఆ తర్వాత అతడు ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పటినుంచి టీం ఇండియాకు నాయకుడిగా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. అతడి ఆధ్వర్యంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా 11 టోర్నీలను వరుసగా గెలుచుకునే పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టింది టీం ఇండియా.
11 వరుస సిరీస్ లు మాత్రమే కాదు, పవర్ ప్లే లో టీమిండియా తన సత్తాను చూపించింది. పవర్ ప్లే లో గుహవాటి వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 2025 లో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా ఒక వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. 2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. 2024లో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ మ్యాచ్లో ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. 2018లో జోహన్నెస్ బర్గ్ లో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఇలా ప్రతి ఏడాది పవర్ ప్లే లో టీమిండియా తన పరుగుల సామర్ధ్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది.
ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్లో టీమిండియా అదరగొడుతోంది. ఈ సిరీస్ లో పవర్ ప్లే లో టీమిండియా యావరేజ్ 39.50 గా నమోదయింది. రన్ రేట్ 13.16 గా రికార్డ్ అయింది. యావరేజ్ స్కోర్ 79 పరుగులు. ఇందులో ఫోర్లు 26 ఉండగా, సిక్సర్లు 15 గా నమోదయ్యాయి. న్యూజిలాండ్ విషయానికి వస్తే యావరేజ్ 21.42, రన్ రేట్ 8.33, ఎవరిది స్కోర్ 50.. ఇందులో ఫోర్లు 19, సిక్సర్లు ఆరుగా నమోదయ్యాయి.
పవర్ ప్లేలో టీమిండియా ఈ స్థాయిలో సత్తా చూపిస్తున్న నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ మనదే అని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. 2024లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా సాధించిన అద్భుతాన్ని ఈసారి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఆటగాళ్లు రిపీట్ చేస్తారని భారత అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు స్వదేశంలో టి20 వరల్డ్ కప్ జరుగుతోంది కాబట్టి.. కచ్చితంగా టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.