North Andhra politics: వారసత్వం అనేది ఒక్క రాజకీయాల్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. సినీ రంగంలో సైతం పరవాలేదు. కానీ క్రీడారంగంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అయితే ఈ రంగంలోనైనా వారసత్వం ఎంట్రీ వరకే. అక్కడినుంచి ఎవరి సామర్థ్యం వారిదే. వారి సమర్థత, రాజకీయ సమీకరణలు, పరిస్థితులు, అనుకూలతలు బట్టి రాణిస్తున్న వారు ఉన్నారు. ఉత్తరాంధ్రలో చూస్తే వారసత్వ రాజకీయం అధికం. ఇప్పటికే కొందరు వారసులు పొలిటికల్ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. ఇంకా మరి కొందరు వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఉత్తరాంధ్రలో రాజకీయ వారసత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయన దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడు కుమారుడు. తండ్రి అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. 2011లో చనిపోయారు ఎర్రం నాయుడు. అప్పటివరకు ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని కూడా ఎవరికీ తెలియదు. ఏ రాజకీయ ముద్ర లేకుండా రామ్మోహన్ నాయుడు ను పెంచారు. విద్యాధికుడు కావడం, ఆపై తండ్రి మాదిరిగా గొప్ప వాగ్దాటి ఉండడంతో 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. 2014లోనే ఎంపీగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. తన వాగ్దాటితో ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఆకర్షించగలిగారు. జాతీయస్థాయిలో మంచి గుర్తింపు సాధించారు. 2024లో హ్యాట్రిక్ విజయం సాధించడం, టిడిపి ఎన్డీఏలో కీలక భాగస్వామి కావడంతో.. రామ్మోహన్ నాయుడుకు కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
రాజకీయ వారసత్వంలో సుదీర్ఘకాలం వేచి చూసి సక్సెస్ అయ్యారు గుడివాడ అమర్నాథ్. ఆయన తండ్రి గుడివాడ గుర్నాథరావు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. తండ్రి అకాల మరణంతో తల్లి రాజకీయ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో టిడిపి కార్పొరేటర్ గా ఉండేవారు అమర్నాథ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. రెండో ప్రయత్నం గా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఏకంగా మంత్రి అయ్యారు. మూడోసారి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన సమర్థత కంటే వైసీపీ చరిష్మ పై ఎక్కువగా ఆధారపడ్డారు.
విశాఖ ఎంపీ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎంవివిఎస్ మూర్తి. సుదీర్ఘకాలం విశాఖ ఎంపీగా ప్రాతినిధ్యం వహించడంతోపాటు తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉండేవారు. ఆయన అకాల మరణంతో మనుమడు శ్రీ భరత్ రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం గెలిచారు. ఆయన గీతం విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ అల్లుడు. మంత్రి నారా లోకేష్ తోడల్లుడు. అందుకే దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
పలాస ఎమ్మెల్యేగా గెలిచారు గౌతు శిరీష. ఆమె మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె. స్వాతంత్ర సమరయోధుడు, మాజీమంత్రి, సర్దార్ గౌతు లచ్చన్న మనుమరాలు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పలాస నియోజకవర్గంలో రెండో ప్రయత్నం గా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అదితి గజపతిరాజు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో రెండో ప్రయత్నంలో భాగంగా పోటీ చేసి గెలిచారు. అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది వారసులు సిద్ధంగా ఉన్నారు. అందులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ముందు వరుసలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం.
మరోవైపు సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సైతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు అసెంబ్లీకి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నరసన్నపేట నుంచి ఈసారి ధర్మాన కృష్ణ దాస్ తప్పుకుంటారు. ఈసారి ఆయన కుమారుడు కృష్ణ చైతన్య పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ సైతం వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు తప్పుకొని కుమారుడు రవితేజకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది.
మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి సైతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని వారసుడికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కుమారుడికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
హ్యాట్రిక్ విజయం సాధించారు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. ఈసారి ఆయన కుమారుడు మౌర్యా సింహ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి కళా వెంకట్రావు కుమారుడు రాం మల్లిక్ నాయుడు సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు కళా వెంకట్రావు. ఈసారి చీపురుపల్లి నుంచి రాం మల్లిక్ నాయుడు పోటీ చేస్తారని తెలుస్తోంది.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ్మినేని సీతారాం తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునే పనిలో ఉన్నారు.
మరోవైపు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష సైతం వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. మొత్తానికి అయితే ఉత్తరాంధ్రలో 2029 ఎన్నికల్లో వారసులు మెరువనున్నారు అన్నమాట. మరి వారు పొలిటికల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.