T20 World Cup 2026 in India: వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో పురుషుల టి20 వరల్డ్ కప్ (mens T20 World Cup 2026) జరగనుంది దీనికి సంబంధించి ఐసిసి కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మెగా ట్రోఫీకి సంబంధించి ఐసీసీ కొంతకాలంగా కసరత్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఐసీసీ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
2026 t20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ట్రోఫీలో దాదాపు 20 దేశాలు పాల్గొంటున్నాయి. భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతా నగరాలలో పోటీలు నిర్వహించబోతున్నారు. శ్రీలంకలోని కొలంబో లో 2, క్యాండీ లోని ఓ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పాకిస్తాన్ మనదేశంలో ఆడదు కాబట్టి.. కొలంబోలో ఆడుతుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక సెమి ఫైనల్, ఫైనల్ వెళ్ళిపోతే కొలంబోలోనే మ్యాచులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవల పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ గడ్డమీద ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టకూడదని భారత్ నిర్ణయించుకుంది. ద్వైపాక్షిక సిరీస్ ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని నిర్ణయించుకుంది. కేవలం ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో మాత్రమే ఆడతామని భారత్ స్పష్టం చేసింది.
మెన్స్ టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి వేదికలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం, కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుపుతారు అనేదానిమీద క్లారిటీ లేదు. 2026 t20 వరల్డ్ కప్ లో మొత్తం 20 దేశాలు తలపడతాయి.. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక పోటీ పడతాయి. గత ప్రపంచ కప్ లో సూపర్ 8 దశకు చేరుకున్న అమెరికా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. ఐసిసి ర్యాంకుల ప్రకారం ఐర్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ప్రపంచ కప్ బెర్త్ సొంతం చేసుకున్నాయి. అమెరికా రీజియనల్ క్వాలిఫైయర్ కావడంతో కెనడాకు అవకాశం లభించింది.