Women’s ODI World Cup:మరి కొద్ది రోజుల్లో భారత్ – శ్రీలంక వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే కసరత్తు చేస్తోంది. ఇంట గెలిచే ముందు రచ్చ కూడా గెలవాలని బృహత్తరమైన ప్రణాళికతో ఉంది. ఈ క్రమంలోనే వన్డే కంటే ముందు పొట్టి ఫార్మాట్లో అదరగొట్టాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే పొట్టి ఫార్మాట్ లో సంచలన ఆట తీరు ప్రదర్శిస్తోంది.
భారత జట్టు ఈసారి మొత్తం స్మృతి మందాన మీద భారీగా ఆశలు పెట్టుకుంది. వన్డే వరల్డ్ కప్ లో ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందనే అంచనా తో ఉంది. భారత జట్టు తన మీద పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా చేస్తోంది స్మృతి. దానికి తగ్గట్టుగానే బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం స్మృతి భీకరమైన ఫామ్ లో ఉంది. మైదానంలో అలవోకగా పరుగులు చేస్తోంది. కేవలం స్వదేశంలోనే కాదు… విదేశీ మైదానాల్లో కూడా సత్తా చాటుతోంది.. తాజాగా ఇంగ్లీష్ జట్టుతో నాటింగ్ హామ్ లో జరిగిన టి20 మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసింది. ఈ సెంచరీ ద్వారా టీమ్ ఇండియా లెజెండరీ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థాయికి చేరుకుంది. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో ఏకంగా 112 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ఉమెన్ క్రికెటర్ గా ఆమె రికార్డు సృష్టించింది. ఇక ఈ సెంచరీ ద్వారా మూడు ఫార్మాట్లలో శతకాలు సాధించిన తొలి టీమిండియా ఉమెన్ క్రికెటర్ గా స్మృతి రికార్డు సృష్టించింది. అయితే ఈ లిస్టులో ఉన్న వారంతా మెన్ క్రికెటర్లు కావడం విశేషం. తాజాగా చేసిన సెంచరీ ద్వారా ఈ లిస్టులో ప్లేస్ సాధించిన తొలి ఉమెన్ క్రికెటర్ గా స్మృతి రికార్డును సొంతం చేసుకుంది..
అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్, సురేష్ రైనా, ఎల్ రాహుల్, గిల్ కొనసాగుతున్నారు. అయితే వీరంతా కూడా పురుష క్రికెటర్లు. ఈ జాబితాలో ఇప్పటివరకు ఒక్క మహిళా క్రికెటర్ కూడా చోటు సంపాదించుకోలేకపోయింది. అంతటి మిథాలీ రాజ్ కూడా ఈ ఘనతను అందుకోలేకపోయింది. అయితే యంగ్ ప్లేయర్ స్మృతి ఈ రికార్డును బద్దలు కొట్టింది. మూడు ఫార్మాట్లలో శతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పురుష క్రికెటర్లు ఆధిపత్యం సాగిస్తున్న వేళ.. నేను ఉన్నానంటూ ఆ జాబితాలోకి ఎక్కింది స్మృతి.
2016లో స్మృతి తొలి వన్డే శతకాన్ని సాధించింది. కంగారు జట్టుపై ఆ రికార్డును అందుకుంది. 2021లో కంగారు జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో స్మృతి శతకం సాధించింది. 2025లో ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో శతకం సాధించింది.. ఇక మూడు ఫార్మాట్ లో శతకాలు సాధించిన భారత పురుష క్రికెటర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
సురేష్ రైనా
2008లో హాంకాంగ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2010లో శ్రీలంక జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సురేష్ రైనా సెంచరీ సాధించాడు. 2010లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో సెంచరీ చేశాడు.
రోహిత్ శర్మ
2010లో జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2013లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో శతకం సాధించాడు. 2015లో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో సెంచరీ చేశాడు.
కేఎల్ రాహుల్
2014లో కంగారు జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2016లో జింబాంబే జుట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో శతకం సాధించాడు. 2016లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో సెంచరీ చేశాడు.
విరాట్ కోహ్లీ
2009లో శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో శతకం అందుకున్నాడు. 2012లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో విరాట్ సెంచరీ చేశాడు.
గిల్ 2022లో జింబాబ్వే వన్డే శతకం చేశాడు. 2022లో బంగ్లాదేశ్ పై టెస్ట్ సెంచరీ చేశాడు. 2023లో న్యూజిలాండ్ జట్టుపై టీ20 శతకం సాధించాడు.