AP BJP President Post: ఏపీ బీజేపీ అధ్యక్ష( AP BJP Chief ) పదవి కోసం గట్టి పోటీ ఉంది. ఎవరికి వారుగా పదవి కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అయితే అది నామ మాత్రమేనని.. హై కమాండ్ సూచించిన వ్యక్తి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అధ్యక్ష పదవి రేసులో కీలకమైన నేతలు ఉన్నారు. ప్రముఖంగా సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఆశావహులుగా ఉన్నారు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఆయన విషయంలో మిగతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సైతం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయవు. అయితే అనూహ్యంగా ఉత్తరాంధ్ర బీసీ నేత పివిఎన్ మాధవ్ తరుపున ఓఎంపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: రుతుపవనాల విస్తరణ.. కుమ్మేస్తున్న వాన!
* తెరపైకి రకరకాల పేర్లు..
ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati purandeshwari) కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. 2023లో ఆమె అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం బిజెపిలో ఉంది. అయితే పురందేశ్వరి ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇచ్చి.. అధ్యక్ష పదవిని వేరే వారికి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ నుంచి బిజెపి తరఫున భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మరొకరిని క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా ఏపీలో పార్టీని బలోపేతం చేయవచ్చని హై కమాండ్ భావిస్తోంది. పురందేశ్వరిని క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయం అని ప్రచారం సాగుతోంది.
* సామాజిక వర్గ సమీకరణలు..
బిజెపి( Bhartiya Janata Party) ఎప్పుడు సామాజిక వర్గ పరిగణలోకి తీసుకుంటోంది. 2014 ఎన్నికల తర్వాత కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చింది. ఆ సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి కేటాయించింది. అటు తరువాత అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు పదవి ఇచ్చింది బిజెపి. ఆయన దాదాపు ఐదేళ్లపాటు అదే పదవిలో కొనసాగారు. కానీ 2024 ఎన్నికలకు ముందు పురందేశ్వరికి ఆ పదవి వివరించింది. దీంతో మరోసారి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అదే జరిగితే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి పదవి ఖాయం అయినట్టే. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
* పివీఎన్ మాధవ్ కు ఇప్పించాలని
అయితే ఉత్తరాంధ్రాకు చెందిన బీసీ నేత పివిఎన్ మాధవ్( pvn Madhav ) గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తండ్రి పివి చలపతిరావు బిజెపిలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీ అధ్యక్ష పదవి కూడా చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్( CM Ramesh). అయితే వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ గెలుపు కోసం మాధవ్ అహర్నిశలు శ్రమించారు. అందుకే సీఎం రమేష్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. బిజెపి పెద్దల వద్ద పరపతి ఉంది ఆయనకు. అయితే అదే సమయంలో సుజనా చౌదరి సీఎం రమేష్ కు సన్నిహితుడు. ఒకవేళ హై కమాండ్ కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలంటే మాత్రం సీఎం రమేష్ ఏమీ చేయలేరు. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మాధవ్ తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మాధవ్ సైతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉండేవారు. విద్యాధికుడు కూడా. అందుకే ఫైనల్ గా ఆయన పేరును ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.