Shubman Gill Rare Record: టీమిండియా కెప్టెన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శతకం సాధించి సత్తా చాటాడు. తొలి రోజు ఇంగ్లీష్ బౌలర్ల పై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అదరగొట్టాడు.
వాస్తవానికి ఈ సిరీస్ కంటే ముందు గిల్ ఇంగ్లీష్ గడ్డ మీద మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. మూడింట్లో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పరుగులు కూడా స్వేచ్ఛగా తీయలేకపోయాడు. దీంతో గిల్ మీద ఎవరికి ఎటువంటి అంచనాలు లేకుండా పోయాయి. పైగా అతని మీద విమర్శలు పెరిగిపోయాయి. అతని కంటే సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారని మేనేజ్మెంట్ మీద విమర్శలు వ్యక్తమయ్యాయి. అసలు గిల్ కు సారధ్య బాధ్యతలు ఎందుకు అప్పగించామనే విషయంపై మేనేజ్మెంట్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఇదే ప్రశ్నను విలేఖరులు టీమ్ ఇండియాకు కోచ్ గౌతమ్ గంభీర్ ను అడిగితే.. అది నా బాధ్యత కాదు అంటూ తప్పించుకున్నాడు. అజిత్ అగార్కర్ కూడా ఏవో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అయితే తన మీద వస్తున్న ఆరోపణలకు.. కొంతమంది కావాలని చేస్తున్న విమర్శలకు మొత్తంగా గట్టి సమాధానం చెప్పాడు టీమిండియా సారధి గిల్.
సెంచరీ చేసి..
ఇంగ్లీష్ జట్టు మీద సెంచరీ చేసి.. నాటౌట్ గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు గిల్.. ఇంగ్లీష్ బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని లీడ్స్ మైదానంలో పరుగుల వరద పారించాడు. వాస్తవానికి గిల్ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇటీవల కాలంలో అతడు ఐపీఎల్లో అదరగొట్టినప్పటికీ.. ఐపీఎల్ లో ఆటకు.. ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఆటకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మైదానాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ పరుగులు తీయడం అంత సులువు కాదు. పైగా ఇంగ్లీష్ బౌలర్లు పదునైన పేస్ బౌలింగ్ వేస్తుంటారు. దీనివల్ల బ్యాటర్లకు ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడుతుంది. అయితే ఇటువంటి కఠిన పరిస్థితిలో కూడా టీమిండియా కెప్టెన్ అదరగొట్టాడు. అంతేకాదు తన టెస్ట్ కెప్టెన్సీ ఆరంగేట్రం లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ జాబితాలో టీమ్ ఇండియా తరఫున విజయ్ హజారే తొలి స్థానంలో ఉన్నాడు. అతడు టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి మ్యాచ్లోనే సెంచరీ చేశాడు. విజయ్ హజారే తర్వాత దిలీప్ వెంగ్ సర్కార్ కూడా ఇదే ఘనతను అందుకున్నాడు. సునీల్ గవాస్కర్ కూడా సారధిగా తొలి టెస్ట్ లోనే సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా జట్టు నాయకుడిగా తను ఆడిన తొలి టెస్ట్ లో సెంచరీ చేశాడు. ఇక ఇంగ్లీష్ జట్టుపై భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న గిల్ కూడా సెంచరీ చేసి లెజెండరీ ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు.
ఇక రెండవ రోజు గిల్ కనుక తన సెంచరీని ద్వి శతకం వైపు మళ్లిస్తే సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా సారధి అయిపోతాడు. ఎందుకంటే కెప్టెన్ గా తను ఆడిన తొలి మ్యాచ్లో ద్వి శతకం సాధించిన సారధిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం జిల్ బ్యాటింగ్ స్టైల్ చూస్తే ఆ రికార్డు సాధించడం పెద్ద కష్టం కాదని అతడి అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.