Shubman Gill England Tour: బంతి తో తిరుగులేదు. బ్యాట్ కు ఎదురులేదు. ఫీల్డింగ్ లో బెదురు లేదు. మొత్తంగా టీమ్ ఇండియా సామర్థ్యానికి డోకా లేదు. కానీ ఇంగ్లీష్ గడ్డమీద సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు.
మిస్టర్ డిపెండబుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో 2007లో టీమిండియా ఇంగ్లీష్ గడ్డ మీద సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఇంతవరకు ఒక్క సిరీస్ విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ భారత జట్టు విజయాలు అందుకోలేకపోయింది. టీమిండియా 1932 నుంచి ఆంగ్ల గడ్డమీద పర్యటిస్తున్నప్పటికీ.. 2007 మినహా మిగతా సందర్భాల్లో సిరీస్ గెలిచిన సందర్భంగా లేదంటే.. పర్యాటక జట్టుకు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 2007లో మూడు టెస్టుల సిరీస్ నిర్వహించారు. నాటింగ్ హమ్ మైదానంలో జరిగిన మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. ముఖ్యంగా జహీర్ ఖాన్ తన బంతితో అద్భుతం చేశాడు. సచిన్ బలమైన పునాది వేస్తే.. గంగూలీ, లక్ష్మణ్ అద్భుతమైన ఆటతీయులు ప్రదర్శించారు. మొత్తంగా ఏడు వికెట్ల వ్యత్యాసంతో భారత్ గెలిచింది. లార్డ్స్, ఓవల్ ప్రాంతంలో జరిగిన మ్యాచులు డ్రా అయ్యాయి.
2007 తర్వాత..
2007 తర్వాత టీమిండియాలో అనేక మార్పులు వచ్చాయి. గొప్ప గొప్ప ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. అయినప్పటికీ ఇంగ్లీష్ గడ్డ మీద భారత్ సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయింది. 2021లో భారత్ కాస్త ప్రతిఘటించింది. ఆతిథ్య జట్టును ఇబ్బంది పెట్టింది. 2-1 వ్యత్యాసంతో సిరీస్ లో అప్పర్ హ్యాండ్ సాధించింది. అయితే అప్పుడు కరోనా వల్ల ఒక టెస్ట్ మ్యాచ్ వాయిదా వేశారు. తిరిగి దానిని 2022లో నిర్వహించారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా నిర్వహించిన నాలుగో టెస్టులో భారత్ ఓటమిపాలైంది. దీంతో సిరీస్ 2-2 తో ముగిసింది..
యువ ఆటగాళ్ల రాకతో..
అయితే ఈసారి భారత జట్టును గిల్ నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. యువ ఆటగాళ్లు జట్టులోకి ప్రవేశించారు. సాయి సుదర్శన్, జైస్వాల్, నాయర్, పంత్, జడేజా వంటి వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. బుమ్రా, సిరాజ్ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. స్పిన్ బౌలింగ్ లో జడేజా కీలకం కానున్నాడు. లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది. ఇక 1932 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు భారత్ – ఇంగ్లీష్ జట్లు 36 టెస్ట్ మ్యాచ్లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 11 గెలిస్తే.. ఇంగ్లాండ్ 17 గెలిచింది. ఎనిమిది మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.
గట్టిగా బదులు చెబుతారా..
ఇంగ్లాండ్ బజ్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇక భారత జట్టులోను పంత్, జైస్వాల్, నాయర్, సుదర్శన్ దూకుడు మీద ఉన్న నేపథ్యంలో.. భారత్ కూడా గట్టిగానే బదులు చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చగొడితే మాత్రం.. భారత బ్యాటర్లు దుమ్మురేపడం ఖాయం. గత సిరీస్ భారత్ వేదికగా జరిగినప్పుడు.. ఇంగ్లాండ్ తొలి టెస్ట్ గెలిచింది. బజ్ బాల్ విధానంలో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మిగతా నాలుగు టెస్టులలో భారత్ ఏకపక్షమైన దూకుడు కొనసాగించి ఇంగ్లీష్ జట్టును నేల నాకించింది. గత పరిణామాల నేపథ్యంలో ఆంగ్ల జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తి కరం.