IND VS BAN Test ; మూడోరోజు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించాడు. బంగ్లా విజయానికి ఇంకా 357 పరుగులు చేయాలి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అయితే అంతకుముందు టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో మైదానంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా యువ ఆటగాళ్లు గిల్(119*), రిషబ్ పంత్ (109) సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమ్ ఇండియా 287/4 స్కోర్ చేసింది. అయితే ఆ పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ డిక్లేర్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టుకు 227 పరుగుల లీడ్ లభించింది. రెండవ ఇన్నింగ్స్ కలుపుకుంటే మొత్తంగా 515 పరుగుల ఆధిక్యం సమకూరింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 81/3 తో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పంత్, గిల్ బాధ్యతాయుతంగా ఆడారు. ముఖ్యంగా పంత్ దూకుడు కొనసాగించాడు. 124 బంతుల్లో పంత్ సెంచరీ చేశాడు. గిల్ 161 బంతులు ఎదుర్కొని సెంచరీ మార్పు చేరుకున్నాడు. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో పంత్ చేసిన పని చర్చకు దారితీస్తోంది..
బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను..
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ బంగ్లాదేశ్ ఫీల్డర్లను సెట్ చేయడం మొదలు పెట్టాడు. వాస్తవానికి అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంగ్లా ఫీల్డర్లు నిస్సహాయులుగా మారిపోయారు. వికెట్లు పడకపోవడం.. పరుగులు ధారాళంగా రావడంతో బంగ్లా ఆటగాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. నిరాశగా ఉన్న వారిలో ఉత్సాహం నింపేందుకు రిషబ్ పంత్ మైదానంలో తనదైన మార్క్ కామెడీ ప్రదర్శించాడు. ” అరే అన్నా లో ఒకరు ఈ వైపుగా రండి. మరొకరు ఇంకోవైపుగా వెళ్ళండి. ఇక్కడ ఒకరు ఉండండి. మధ్య వికెట్ వైపు వెళ్లండి” అంటూ బంగ్లా ఫీల్డర్లకు పంత్ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో బంగ్లా కెప్టెన్ షాంటో రిషబ్ పంత్ మాట విన్నాడు. ఒక ఫీల్డర్ ను మధ్య వికెట్ మీదుగా సెట్ చేశాడు. అయితే గతంలో మహేంద్ర సింగ్ ధోని కూడా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో ఇదే తరహాలో వారికి ఫీల్డింగ్ సూచనలు ఇచ్చాడు. అప్పట్లో సోషల్ మీడియా వినియోగం ఇంతగా లేకపోవడంతో ఆ ఘటన వెలుగులోకి రాలేదు.
సామాజిక మాధ్యమాలలో..
రిషబ్ పంత్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై టీమిండియా అభిమానులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.. పంత్ బ్రో.. నువ్వు ఆడుతోంది టీమ్ ఇండియాకా? బంగ్లాదేశ్ జట్టుకా? అని కామెంట్స్ చేస్తున్నారు. “నువ్వు చెప్పినట్టే బంగ్లాదేశ్ కెప్టెన్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అయినప్పటికీ నీ పరుగుల ప్రవాహం ఆగలేదు. దీనినిబట్టి బంగ్లాదేశ్ ఆటగాళ్లను బుగ్గ గాళ్ళను చేసావ్. నీ బుర్రే బుర్ర.. ఇలాంటి ఆట తీరు ప్రదర్శించాలంటే నైపుణ్యానికి మించి కళా పోషణ కావాలి. అదే నీలో చాలా ఉందని” పంత్ ను ఉద్దేశించి నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Always in the captain’s ear, even when it’s the opposition’s!
Never change, Rishabh Pant! #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/PgEr1DyhmE
— JioCinema (@JioCinema) September 21, 2024