IPL 2025 RCBvPBKS Final : ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (24), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (26) పర్వాలేదనే స్థాయిలో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ ఔట్ కావడంతో పంజాబ్ జట్టును గెలిపించే బాధ్యతను కెప్టెన్ అయ్యర్, ఇంగ్లిస్ భుజాల కు ఎత్తుకున్నారు. వీరిద్దరూ చాప కింద నీరు లాగా విస్తరిస్తూ పరుగులు చేస్తున్నారు. అయ్యర్ (1) షెఫర్డ్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ దిశగా వెళ్తున్న బంతిని అనవసరంగా వెంటాడాడు. దీంతో కీపర్ జితేష్ శర్మకు చిక్కాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో నిరాశ నెలకొంది. పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతి జింటా నిర్వేదంలో మునిగిపోయింది. వాస్తవానికి ఐపీఎల్ లో అయ్యర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. క్రితం మ్యాచ్లో ఏకంగా సూపర్ హాఫ్ సెంచరీ తో ముంబై జట్టు పై తన జట్టును గెలిపించాడు. అదే కాదు దాదాపు 11 సంవత్సరాల తర్వాత తన జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు.
దూకుడుగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో అతని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్లో అదరగొడతాడని పంజాబ్ అభిమానులు అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ అయ్యర్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత అయ్యర్ తీవ్ర నిరాశలో కనిపించాడు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు. అతడు అవుట్ అయి అలా వస్తుంటే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అయ్యర్ అవుట్ అయిన తర్వాత బెంగళూరు ఆటగాళ్లు మైదానంలో విపరీతంగా సందడి చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే అమాంతం గాల్లోకి లేచి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మొత్తానికి సాధించాం అన్నట్టుగా గట్టిగా కేకలు వేశాడు.. అయ్యర్ అవుట్ కావడంతో పంజాబ్ జట్టు కాస్త ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతానికి క్రీజ్ లో ఇంగ్లిస్(31), నెహల్ వదేరా(1) ఉన్నారు. పంజాబ్ విజయం సాధించాలంటే 54 బంతుల్లో 103 పరుగులు చేయాలి. మొదట్లో పంజాబ్ ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత వెంటనే మూడు వికెట్లను కోల్పోవడంతో తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయారు.. ఈ క్రమంలో బెంగళూరు బౌలర్లు మ్యాచ్ పై క్రమంగా పట్టు సాధిస్తున్నారు. బెంగళూరు కెప్టెన్ స్పిన్, ఫాస్ట్ బౌలర్ల కలయికతో బౌలింగ్ వేయిస్తున్నాడు. అందువల్లే పంజాబ్ జట్టు తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోతోంది.