India vs SA Test: ఒక్కో బంతి ఒక్కో డైనమైట్ లాగా దూసుకు వచ్చింది.. బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పరుగులు తీయడం కాదు కదా.. క్రీజులో ఉంటే అదే గొప్ప అని బ్యాటర్లు అనుకునే విధంగా అనిపించింది. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద బౌలర్లు ఎంతో శ్రమిస్తే తప్ప బంతిమీద గ్రిప్ దొరకదు. కానీ దానిని సులభంగానే అందుకున్నాడు బుమ్రా. అంతేకాదు దక్షిణాఫ్రికా జట్టును పేక మేడ మాదిరిగా కూల్చేశాడు.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జుట్టు సారధి బవుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే ఓపెనర్లు తొలి వికెట్ కు అర్థ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. జోరు మీద ఉన్న ఓపెనర్లు రికెల్టన్ (23), మార్క్రం (31) బుమ్రా బౌలింగ్ అవుట్ అయ్యారు. ఇక అప్పటినుంచి దక్షిణాఫ్రికా వికెట్ల పతనం నిరాటంకంగా కొనసాగింది. ముల్డర్ (24) , జోర్జి (24) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు.. కెప్టెన్ బవుమా(3) సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. మాకో జాన్సన్ డక్ అవుట్ అయ్యాడు. ఇక మిగతా ఆటగాళ్ల ప్రదర్శన అంతంత మాత్రం గానే ఉంది.
బుమ్రా 14 ఓవర్లు వేశాడు. ఇందులో 5 మెయిడ్ ఇన్ ఓవర్లు. కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలకమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 12 ఓవర్ల పాటు బౌలింగ్ వేసాడు. 47 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. కులదీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వికెట్లు సొంతం చేసుకోలేకపోయినప్పటికీ డిఫరెంట్ బంతులు వేసి పర్యాటక జట్టు బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
వాస్తవానికి ఈ మైదానం మీద అంత త్వరగా బౌలర్లకు బంతిమీద పట్టు చిక్కదు. కాని దానిని జస్ ప్రీత్ త్వరగానే అందిపుచ్చుకున్నాడు. డిఫరెంట్ బంతులు వేసి అదరగొట్టాడు. అతని బౌలింగ్లో ఆడాలంటేనే పర్యటక జట్టు బ్యాటర్లు భయపడ్డారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 159 పరుగులకే కుప్ప కూలింది. ఎన్నో అంచనాలతో మైదానంలోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా ప్లేయర్లు కనీసం 60 ఓవర్ల పాటు కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు. పిచ్ కండిషన్ అర్థమవుతున్నప్పటికీ దక్షిణాఫ్రికా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం పట్ల క్రికెట్ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు. కనీసం ఒకరోజు కూడా పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేయకుండా దక్షిణాఫ్రికా జట్టు చేతులు ఎత్తివేయడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో విజేతగా నిలిచిన ఆ జట్టు ఇలా ఆడుతుందని వారు కలలో కూడా ఊహించలేదు