India vs Pakistan: సూపర్ 4 పోరు లో భారత్ గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దర్జాగా ఆసియా కప్ వేటలో మరో అడుగు ఘనంగా ముందుకు వేసింది. ఈ సిరీస్ లో వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని సరి కొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో పాకిస్తాన్ పై విజయం సాధించిన భారత్.. సూపర్ 4 దశలో కూడా దానిని కొనసాగించింది. భారత్ విజయం సాధించింది కాబట్టి పెద్దగా ఇబంది లేదు. పైగా ఇది నవరాత్రుల సందర్భంగా భారత అభిమానులకు బోనస్ లాంటిది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ భారత్ చేసిన తప్పులు.. అభిమానులకు ఇబ్బందికరంగా మారాయి.
బౌలింగ్లో భారత జట్టు ఇబ్బందికి గురైంది.. ముఖ్యంగా సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా దారుణంగా పరుగులు ఇచ్చాడు. కులదీప్ యాదవ్ తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి సక్రమంగానే బౌలింగ్ వేసినప్పటికీ ఫీల్డింగ్ లోపాలు భారత జట్టును ఇబ్బంది పెట్టాయి. శివం దుబే జట్టుకు అవసరమైన సందర్భంలో వికెట్లు తీశాడు. అతని వల్లే టీమ్ ఇండియా కు ఉపశమనం లభించింది.. అతడి మీద సూర్య కుమార్ యాదవ్ నమ్మకం ఉంచడం.. జట్టుకు ఉపయుక్తంగా మారింది. ఫీల్డింగ్ లో భారత ప్లేయర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా నాలుగు క్యాచ్ లను నేలపాలు చేశారు.. వచ్చిన అవకాశాలను పాకిస్తాన్ ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. అందువల్లే ఆ స్థాయిలో స్కోర్ చేశారు. టీమిండియాలో అభిషేక్ శర్మ, గిల్, తిలక్ వర్మ అదరగొడితే.. సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ నిరాశపరిచారు. సూర్య కుమార్ యాదవ్ నిర్లక్ష్యమైన షాట్ కొట్టి అవుట్ కాగా.. సంజు బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Also Read: బుమ్రా పని అయిపోయిందా.. రిటైర్మెంట్ ప్రకటించక తప్పదా?
టీం ఇండియా భారీ స్కోరును కూడా చేజ్ చేయగలిగిందంటే దానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ. ప్రారంభం నుంచి అతడు దూకుడు కొనసాగించాడు. ఒకరకగా అతని వల్లే టీమిండియా సులువుగా విజయాన్ని సాధించింది. విజయం సాధించినప్పటికీ టీమిండియా లో ఉన్న లోపాలు ఈ మ్యాచ్ ద్వారా బయటపడ్డాయి. తదుపరి బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో ఈ లోపాలను టీమ్ ఇండియా సవరించుకుంటేనే బాగుంటుంది.. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బౌలింగ్లో భారత్ తన లయను అందుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఒమన్ తో జరిగిన మ్యాచ్లో భారత బౌలింగ్ వైఫల్యం కనిపించింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోను బౌలింగ్ వైఫల్యం కనిపించింది. బ్యాటర్లు అదరగొట్టారు కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఫలితాలు వేరే విధంగా వచ్చేవి. టీమ్ ఇండియా నుంచి ఇటువంటి బౌలింగ్ ప్రదర్శనను భారత అభిమానులే కాదు.. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఒప్పుకోరు.