Jammu Kashmir cricket: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు క్రమేపి చక్కబడుతున్నాయి. లాల్ చౌక్ లాంటి ప్రాంతంలో మన దేశపు జెండా రెపరెపలాడుతోంది. మన దేశ రాజ్యాంగం ఆ ప్రాంతంలో అమలవుతోంది. ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు సైన్యం ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. వేర్పాటు వాదులకు చుక్కలు చూపిస్తోంది. త్వరలో ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పాల్గొనేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఆ ప్రాంత నేతలతో సమాలోచనలు జరుపుతున్నాయి. ఇదంతా జరుగుతుండగానే కాశ్మీర్లో మరో కొత్త చరిత్ర మొదలుకానుంది. కల్లోలిత రాష్ట్రంగా పేరు పొందిన ఆ ప్రాంతంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది.
40 ఏళ్ల తర్వాత
కాశ్మీర్లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ఆడేందుకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల వల్ల 40 సంవత్సరాల నుంచి క్రికెట్ టోర్నీ నిర్వహించడం లేదు. దీంతో అక్కడి క్రికెటర్లకు సరైన శిక్షణ ఉండడం లేదు. దీంతో వారు క్రికెట్ లో రాణించాలంటే కచ్చితంగా ఇతర ప్రాంతాలకు రావాల్సి వస్తోంది. టోర్నీలు నిర్వహించకపోవడంతో ఔత్సాహిక క్రికెటర్లకు అవకాశం లభించడం లేదు. దీంతో వారి ప్రతిభ మరుగున పడిపోతుంది. అయితే ఇన్నాళ్లకు జమ్మూ కాశ్మీర్ క్రికెటర్లకు శుభవార్త లభించింది. 40 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో టాప్ ఆటగాళ్లు క్రికెట్ ఆడటానికి వస్తున్నారు.
వచ్చేనెల 20 నుంచి..
సెప్టెంబర్ 20 నుంచి లెజెండ్స్ క్రికెట్ టోర్నీ పేరుతో ఇక్కడ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జమ్ముతోపాటు శ్రీనగర్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పోటీ పడతాయి. 25 మ్యాచ్లు జరుగుతాయి. అక్టోబర్ 10న ఫైనల్ మ్యాచ్ శ్రీనగర్లోని భక్షి మైదానంలో జరుగుతుంది.. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరు అందుకున్నాయి. ఇక్కడ జాతీయ రహదారులు నిర్మాణమయ్యాయి. పెద్దపెద్ద మల్టీప్లెక్స్ లు కూడా ఏర్పాటయ్యాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ క్రికెట్ టోర్నీ నిర్వహించడం సానుకూలాంశమని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల స్థానిక యువకులకు అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. తద్వారా ఆ యువకుల్లో ఉన్న ప్రతిభ బయటి ప్రపంచానికి తెలుస్తుందని వివరిస్తున్నారు. అలాంటి ఆటగాళ్ల వల్ల దేశ క్రికెట్ లో యువరక్తం నిండుతుందని పేర్కొంటున్నారు.