Chris Gayle : సమవయసు ఉన్న నలుగురు వ్యక్తులు ఒక దగ్గర చేరితే రకరకాల చర్చలు జరుగుతాయి. వారు వ్యాపారులైతే డబ్బు గురించి.. క్రీడాకారులైతే క్రీడల గురించి.. వ్యసన పరులు అయితే వ్యసనాల గురించి చర్చలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మీరు చదువుబోయే కథనంలో ముగ్గురు భిన్న రంగాలకు చెందిన వ్యక్తులు కలిశారు. వారిలో ఇద్దరు భారతదేశానికి చెందినవారు.. ఒకరు కరేబియన్ దేశానికి చెందినవారు. వారు ముగ్గురు కూడా వివాదాస్పద వ్యక్తులే. వారి ముగ్గురికి క్రికెట్ తో సంబంధం ఉంది. ఒకరు ఆటగాడు అయితే.. ఇంకొకరు వ్యాపారి.. మరొకరు క్రికెట్ ను అమ్మడం తెలిసిన నేర్పరి.. వీరి ముగ్గురు ఇంగ్లీష్ దేశంలో భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది.
వెస్టిండీస్ మాజీ ఆటగాడు గేల్ ఇటీవల ఇంగ్లాండు వెళ్ళాడు. ప్రస్తుతం అతడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ టోర్నీ ఇంగ్లాండ్ దేశంలో జరగనుంది. అందువల్లే అతడు ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. దానికంటే ముందు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ, ఆర్ సి బి మాజీ ఓనర్ విజయ్ మాల్యాను కలిశాడు. సహజంగా ఈ ముగ్గురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే గేల్ గతంలో బెంగళూరు జట్టుకు ఆడాడు. ఆ సమయంలో బెంగళూరు ఓనర్ గా విజయ్ మాల్యా ఉన్నాడు. విజయ్ మాల్యాకు, గేల్ కు గట్టి స్నేహం ఉంది.
గేల్ కోసం అప్పుడు మాల్యా భారీగానే డబ్బు ఖర్చు చేశాడు.దురదృష్టవశాత్తు బెంగళూరు జట్టు అప్పుడు ఐపీఎల్ గెలవలేకపోయింది. ఇటీవల కాలంలో విజేతగా నిలిచింది. ఆ సమయంలో గేల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విజయ్ మాల్యా కూడా సోషల్ మీడియాలో తన ఉద్వేగాన్ని పంచుకున్నాడు. అయితే వీరిద్దరు కూడా విలాస పురుషులే కావడం విశేషం. మరోవైపు లలిత్ కూడా వీరితో జత చేరాడు. వీరు ముగ్గురు కలిసి దిగిన ఫోటోలను గేల్ తన ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీగా షేర్ చేశాడు.. వీరిద్దరిని కలవడం ఆనందంగా ఉందని.. వారితో కబుర్లు చెప్పుకోవడం సంతోషంగా ఉందని గేల్ వ్యాఖ్యానించాడు. గేల్, లలిత్ మోడీ, విజయ్ మాల్యా గట్టిగా ఏదో ప్లాన్ చేశారని.. అందువల్లే వారు ముగ్గురు భేటీ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ మాల్యా ఆఫ్రికా దేశాలలో వ్యాపారాలు సాగిస్తున్నాడు. అందులో కరేబియన్ కంట్రీ కూడా ఉంది. ఇక లలిత్ మోడీ రకరకాల వ్యాపారాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల సుస్మిత సేన్ తో అతడు డేటింగ్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. వారిద్దరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగింది. దీనిపై అటు సుస్మిత.. ఇటు లలిత్ నోరు విప్పలేదు. మరోవైపు వీరు ముగ్గురు కలిసి ఆఫ్రికా ఖండంలో క్రికెట్ కేంద్రంగా సాగే వ్యాపారం చేయాలని రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సఫారీ దేశంలో నిర్వహిస్తున్న t20 క్రికెట్ లీగ్ విజయవంతమైంది. కరేబియన్ దీవులలో సాగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్ లు కూడా విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ క్రికెట్ లీగ్లలో పెట్టుబడులు పెట్టి జట్లను కొనుగోలు చేయాలని యోచన వీరి ముగ్గురికి ఉందని తెలుస్తోంది. అందువల్లే భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.