
IPL Semi Final 2021: ఐపీఎల్ 14 వ సీజన్ రసవత్తరంగా మారింది. గతేడాది జరగాల్సిన మ్యాచ్ లు కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా సాగుతున్న మ్యాచ్ లు కీలక దశకు చేరుకున్నాయి. పైనల్ పోరులో నిలిచేందుకు ఈరోజు సాయంత్రం రెండు కీలక జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ కింగ్ గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్.. 2019లో టైటిల్ వేటలో విజయం ముందు బోల్తాపడి మరోసారి అవకాశం ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ తొలిక్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచిన వారు నేరుగా ఫైనల్ లో అడుగుపెట్టనుండగా.. ఓడిన జట్టుకు సైతం టైటిల్ పోరులో నిలిచేందుకు మరో అవకాశం కూడా ఉంది. రిస్క్ లేకుండా.. నేరుగా ఫైనల్ కు చేరేందుకు ఇరుజట్లు సంసిద్ధంగా ఉన్నాయి.
సీజన్లో బలమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే అనూహ్యంగా ఈసారి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలువగా.. రెండోస్థానంలో నిలిచిన చెన్నైతో తాడోపేడో తేల్చుకోనుంది. ఐపీఎల్ లీగ్ మొత్తంలో రెండు జట్లు బలంగానే ఉన్నాయి. అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాయి. అయితే ఈసారి చెన్నై టీం కన్నా.. ఢిల్లీ క్యాపిటల్సే.. చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ తొలి టైటిల్ ను సొంతం చేసుకోవాలని జట్టు ఆటగాళ్లందరూ సమష్టిగా అడుతున్నారు. రెండు జట్ల మధ్య ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ ల్లో ఢిల్లీనే విజయం సాధించగా.. ఒక్కసారి చెన్నై గెలుపొందింది.
అయితే ఐపీఎల్ మ్యాచ్ ల్లో ధోనీ సేనను తక్కువ అంచనా వేయలేదు. మొదట్లో కూల్ గా ఉన్నా.. కీలక సమయంలో పంజా విసురుతారు.. ఈ చెన్నై హీరోలు. చెన్నైకి బ్యాటింగ్ లైనప్ బాగుంది. ఇప్పటి వరకు కొనసాగిన మ్యాచ్ ల్లో డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ కీలకంగా వ్యవహరించి జట్టును ఇక్కడకి తీసుకొచ్చారు. మిగితా ప్లేయర్లు అడపా దడపా రాణించగా.. సురేశ్ రైనా.. జట్టులోకి వస్తాడా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇక కెప్టెన్ ధోనీ ఇప్పటి వరకు కూల్ గానే వ్యహరించారు. అతడి ప్రభావాన్ని చూపాల్సి ఉంది. ఇక ఢిల్లీ జట్లు మొదటి నుంచి పటిష్టంగానే కనిపిస్తోంది. సీజన్ లో శరవేగంగా దూసుకెళ్తోంది. నిలకడమైన బ్యాటింగ్.. కట్టుదిట్టమైన బౌలింగ్ ఢిల్లీపై టైటిల్ ఆశలు పెంచుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఢిల్లీనే చెన్నైపై పైచేయి సాధించింది. మరికొద్ది గంటల్లో మరో కీలక టైటిల్ పోరుకు ఇరుజట్లు సిద్ధం అవుతున్నాయి. చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో..?