
Balakrishna Cast His Vote: ‘మా’ ఎన్నికలు అనే సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఇక ఫస్ట్ హాఫ్ లో బాలయ్య, చిరు, పవన్ లాంటి స్టార్ హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పోసాని, మోహన్ బాబు లాంటి కాంట్రవర్సీ స్టార్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ సందర్భంగా.. మా ఎన్నికల గురించి బాలయ్య బాబు తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య మాటల్లోనే.. ‘ప్రకాశ్ రాజ్ గారు, తమ్ముడు విష్ణు సినిమా పరిశ్రమకు అన్నదమ్ముళ్ల లాంటి వారు. వాళ్లిద్దరూ సమర్థులే. వాళ్ళు మాటల్లో చెప్పడమే కాదు, చేతుల్లో కూడా చేసి చూపించే తెగింపు ఉన్నవాళ్లు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో నాలుగు మాటలు అనుకోవచ్చు. కానీ రేపు షూటింగ్‌లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమే.
ఇక నా ఓటు విషయానికి వస్తే.. ఎవరు ఇండస్ట్రీకి ఎక్కువ మేలు చేస్తారో వారికే నా ఓటు వేయడం జరిగింది. అయితే, ఇద్దరూ ఇండస్ట్రీకి మేలు చేసేలా కనిపిస్తున్నారు.అందుకే , రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ఐతే మా సభ్యుల అవసరాలు తీర్చడానికి ఎన్నికల్లో గెలిచిన వారిదే బాధ్యత కాదు, పరిశ్రమలోని అందరి పైన ఆ బాధ్యత ఉంది’ అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.
కాగా బాలయ్య తన ఓటును మంచు విష్ణుకి వేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో శ్రీకాంత్ కి కూడా తన ఓటు వేసినట్లు తెలుస్తోంది. బాలయ్య అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ బాలయ్యని ఓటు వేయాల్సిందిగా కోరాడు. అయితే, బాలయ్య మాత్రం మంచు విష్ణుకే తన ఓటు అని, కాకపోతే మీ ప్యానెల్ లో నీకు మాత్రమే ఓటు వేస్తాను అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం మంచు విష్ణు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.