IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్లో బెంగళూరు, చెన్నై తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా అభిమానులు కీలక ఆటగాళ్లపై ఎక్కువగా దృష్టి సారించారు. సామాజిక మాధ్యమాలలో ఆ ఆటగాళ్లు గతంలో సాధించిన రికార్డులను తెగ శోధిస్తున్నారు. ఇంతకీ ఆ జాబితాలో ఉన్న ఆటగాళ్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ
2008 నుంచి అతడు బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. అంటే ఐపీఎల్ ప్రారంభం నుంచి అతడు బెంగళూరు తోనే ఉన్నాడు. 2008, 2009 మినహాయిస్తే.. 2010 నుంచి 23 వరకు ఏ ఒక్క సీజన్ లోనూ కోహ్లీ 3 కంటే తక్కువ పరుగులు చేయలేదు. గత సీజన్లో అయితే ఏకంగా 639 పరుగులు చేశాడు. గత 14 ఐపీఎల్ మ్యాచ్ లలో కోహ్లీ సగటు 53.25 అంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో నిదానంగా ఆడి తర్వాత .. మెరుపులు మెరిపించడం ఐపీఎల్లో కోహ్లీకి రివాజు గా మారింది. అయితే ఈ సీజన్లో కూడా కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మాక్స్ వెల్
తుఫాన్ ఇన్నింగ్స్ కు మాక్స్ వెల్ పర్యాయపదం అంటే అతిశక్తి కాదు. తన కెరియర్లో ఎక్కువ భాగం వైట్ బాల్ ఫార్మాట్ కే మాక్స్ వెల్ పరిమితమయ్యాడు. వన్డే లేదా టీ -20.. ఇలా ఏ ఫార్మాట్ అయినా మాక్స్ వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగలడు. బౌలింగ్ లోనూ సత్తా చాట గలడు. గత సీజన్లో అతడు 4 పరుగులు సాధించాడు. ఐపీఎల్ కెరియర్లో ఇప్పటివరకు 31 వికెట్లు సాధించాడు. ఈ సీజన్లోనూ బెంగళూరు తరఫున సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
రుతు రాజ్ గైక్వాడ్
రుతు రాజ్ గైక్వాడ్ నిలకడైన ఆటకు మారుపేరు. పైగా ఇప్పుడు చెన్నై జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ధోని కి నచ్చిన ఈ క్రికెటర్ గత సీజన్లో 590 పరుగులు చేశాడు. గతం కంటే ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తాడని చెన్నై అభిమానుల భావిస్తున్నారు. ఇప్పుడు కెప్టెన్ గానూ ఉండటంతో అందరి కళ్ళూ ఇతడి పైనే ఉన్నాయి.
రచిన్ రవీంద్ర
భారతీయ మూలాలు ఉన్న ఈ న్యూజిలాండ్ క్రికెటర్ గత వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన ఆట తీరు ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇండియాలో జరిగిన ప్రపంచకప్ లో పది మ్యాచ్ లలో 578 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై జట్టు ఇతడిని 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. భారతీయ మూలాలు ఉన్న ఈ క్రికెటర్ పై చెన్నై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది.
మహమ్మద్ సిరాజ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ప్రధాన బౌలర్ ఇతడు. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తనదైన రోజు మ్యాచ్ ను మలుపు తిప్పగల నైపుణ్యం ఇతడి సొంతం. ఈ ఆటగాళ్లు గనక రాణిస్తే ఆ జట్లు గెలిచినట్టే. మెరుగైన రికార్డులు ఉండడంతో అభిమానులు వీరిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రారంభ మ్యాచ్ ద్వారా వీరు ఎలాంటి సంకేతాలను ఇస్తారో మరికొద్ది గంటల్లో తేలనుంది.