SRH Vs CSK: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఘనత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుది. ముంబై జట్టుతో సమానంగా చెన్నై ఐదు సార్లు ట్రోఫీలు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ధోని నాయకత్వంలో చెన్నై జట్టు గొప్ప గొప్ప విజయాలు సాధించింది. గత మెంతో ఘనచరిత్ర కలిగిన చెన్నై జట్టు.. ఇప్పుడు మాత్రం అధ్వానమైన ఆట తీరుతో పరువు తీసుకుంటున్నది.
చెన్నై జట్టు ప్రస్తుత ఐపిఎల్ లో తన స్థాయి ఆట తీరు కొనసాగించలేకపోతోంది. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారు. అనితర సాధ్యమైన ఆట తీరు వారు కొనసాగించగలరు. కానీ, చివర్లో తడబడుతూ ఓటములను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్.. మరి కొన్ని సందర్భాలలో బౌలింగ్.. మిగతా సందర్భాలలో ఐకమత్యం లోపించడం వంటి కారణాలతో చెన్నై జట్టు మూల్యాలను చెల్లించుకుంటున్నది.
హైదరాబాద్ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఓటమిపాలైంది.. మెరుగైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. స్థిరమైన ఇన్నింగ్స్ నిర్మించలేకపోవడంతో ఆ జట్టు విజయాల పరంపరను కొనసాగించలేకపోయింది. ఇటీవల వరుసగా రెండు మ్యాచ్ల్లో చెన్నై జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత ఆ జోరు మళ్లీ కొనసాగించలేకపోయింది. హైదరాబాద్ జట్టు మీద వారి సొంత గడ్డపై ఓడిపోయింది. ఈ ఓటమి ద్వారా చెన్నై జట్టు అత్యంత చెత్త రికార్డులను మూటగట్టుకున్నది. 2019 నుంచి 180+ పరుగులను ఒక్కసారి కూడా చెన్నై జట్టు చేదించలేకపోయింది. 14 సార్లు 180 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సిన అవసరం ఉండగా.. అన్నింట్లోనూ చెన్నై జట్టు ఓటమిపాలైంది.
హైదరాబాద్ గడ్డమీద చెన్నై జట్టు 8 సంవత్సరాలుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఈ సీజన్లో చెన్నై జట్టు ఆరు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. నాలుగింట్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై జట్టు ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టులోకి ధోని రావలసిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానిస్తున్నారు. గైక్వాడ్ నాయకత్వం గొప్పగా లేదని.. అతడి వ్యూహాలు జట్టుకు లాభాన్ని చేకూర్చడం లేదని.. ఒత్తిడిలో అతడు తీసుకున్న నిర్ణయాలు జట్టు ఓటములకు కారణమవుతున్నాయని అభిమానులు పేర్కొంటున్నారు. అతడు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.