Champions Trophy 2025
Champions Trophy 2025: ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. అందువల్లే అతడు సిడ్నీ టెస్టులో బౌలింగ్ వేయలేకపోయాడు.. అయితే అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్యుల బృందం చేర్పించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ దేశానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ బుమ్రా ను స్వయంగా పరీక్షించాడు. కొంతకాలం పాటు చికిత్స తీసుకోవాలని సూచించాడు. దీంతో అతడిని ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ కు టీమిండియా మేనేజ్మెంట్ దూరం పెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. అయితే ఇంగ్లాండ్ జట్టుతో బుధవారం జరిగే మూడో వన్డేలో బుమ్రా జట్టులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా ఇదే దిశగా సంకేతాలు ఇచ్చింది. అయితే అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేదని.. వెన్నునొప్పి ఇంకా తగ్గలేదని జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. బుమ్రా ఆడతాడా? లేదా? అనే విషయంపై ఒక స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బుమ్రా ను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించబోరని తెలుస్తోంది. ఎందుకంటే అతడు ఇంకా కోలుకోలేదని.. ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా లేదని సమాచారం.. ఇటీవల షమీ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆడుతున్నాడు. అయితే మునుపటిలాగా అతడు ప్రతిభ చూపించలేకపోతున్నాడు. వర్ధమాన బౌలర్ హర్షిత్ రాణా మాత్రం పర్వాలేదు అనిపిస్తున్నాడు.
అతడికి అవకాశం
బుమ్రా పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ప్రదర్శించని పక్షంలో.. టీమిండియా సెలక్షన్ కమిటీ అతని ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉంచిన తరుణంలో.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఆడించే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు మిస్టీరియస్ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన నేపథ్యంలో.. వాషింగ్టన్ సుందర్ లేదా, కులదీప్ యాదవ్ పై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ముగ్గురిని జట్టులోకి తీసుకున్నప్పటికీ.. మైదానం పరిస్థితి.. జట్టు అవసరాల దృష్ట్యా వరుణ్ చక్రవర్తిని ఎక్కువగా ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ చక్రవర్తి ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో అదరగొట్టాడు. ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. గతంలో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడుతుంది కాబట్టి.. ఆ మైదానం స్పిన్ బౌలర్లకు అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. అలాంటప్పుడు వరుణ్ చక్రవర్తి తో పాటు కులదీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్రౌండర్ కేటగిరిలో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కు అవకాశం లభించవచ్చు. అయితే బుమ్రా ఆడని పక్షంలో.. జట్టులో చోటు దక్కించుకునే ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై మరికొద్ది గంటల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ క్లారిటీ ఇవ్వనుంది.