SRH Vs MI: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించింది. కోల్ కతా జట్టు చేతిలో వెంట్రుక వాసిలో ఓడిపోయిన ఆ జట్టు.. ముంబై చేతిలో ఆ తప్పును పునరావృతం కానివ్వలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్లు 277 పరుగుల భారీ స్కోర్ సాధించారు. ముంబై బ్యాటర్లు కూడా ధాటిగానే బ్యాటింగ్ చేసినప్పటికీ 246/5 వద్దే ఇన్నింగ్స్ ఆగిపోయింది. ముంబై ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఒకానొక దశలో ఆ జట్టు గెలుస్తుందని అందరూ భావించారు.
కష్ట కాలంలో హైదరాబాద్ జట్టును కెప్టెన్ పాట్ కమిన్స్ ఆదుకున్నాడు. బ్యాటింగ్ కు సహకరించే మైదానంపై బంతితో అద్భుతాలు చేశాడు. హైదరాబాద్ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీసి గెలుపు బాటలో పయనించేలా చేశాడు. అద్భుత బౌలింగ్, కెప్టెన్సీ తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇదే సమయంలో ఐపీఎల్ వేలంలో తనకు 20.5 కోట్ల భారీ ధరను పెట్టినప్పుడు నొసలు చిట్లించిన వారికి.. తన ఆట తీరుతో సమాధానం చెప్పాడు.
ఈ మ్యాచ్లో ముంబై బ్యాటర్లు చేజింగ్ సమయంలో దూకుడుగా ఆడారు. హైదరాబాద్ ఆటగాళ్లు ను మించి బ్యాటింగ్ చేశారు. ఈ సమయంలో కమిన్స్ తన బౌలింగ్ తో అద్భుతమే చేశాడు. ముంబై ఆటగాళ్లకు బ్రేక్ వేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు విజయం సాధించగలిగింది. రోహిత్ శర్మ, కిషన్ ముంబై జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరి జోరుకు ముంబై జట్టు కేవలం 3.2 ఓవర్లలోనే 56 పరుగులు చేసింది. కిషన్ 34 పరుగుల వద్ద అవుటయినప్పటికీ రోహిత్ శర్మ దూకుడు తగ్గించలేదు. వన్ డౌన్ బ్యాటర్ నమన్ దీర్ కూడా అతడికి సహకరించాడు. దీంతో 4.2 ఓవర్లలోనే ముంబై స్కోరు 66 పరులకు చేరుకుంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ కెప్టెన్ బంతితో మాయాజాలం చేశాడు. 12 బంతుల్లో 26 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ చేశాడు. దీంతో హైదరాబాద్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ రోహిత్ అలాగే ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది..
నమన్ అవుట్ అయినప్పటికీ తిలక్ వర్మ మరింత దూకుడుగా ఆడాడు. 24 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.. ఇలాంటి దశలో 15 ఓవర్లో బౌలింగ్ చేసిన కమిన్స్ తిలక్ వర్మను అవుట్ చేశాడు. ఫలితంగా 182 రన్స్ వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. ఈ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ హైదరాబాద్ చేతుల్లోకి వచ్చింది. మొత్తానికి 31 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. ఈ మ్యాచ్లో రెండు జట్ల బౌలర్లలో కమిన్స్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగో ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఫీల్డింగ్ మార్పులు చేర్పులతో ముంబై ఆటగాళ్లను తికమక పెట్టాడు. వేలంలో అంత ధరా అని దీర్ఘాలు తీసిన వారితోనే చప్పట్లు కొట్టించుకున్నాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Captain pat cummins played a key role in sunrisers hyderabads victory
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com