TDP Janasena BJP Alliance: ఏపీలో అన్ని పార్టీల అభ్యర్థుల ప్రకటన ఒక కొలిక్కి వచ్చింది. అందరికంటే ముందుగా వైసిపి అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇటు కూటమిలో సైతం స్పష్టత వచ్చింది. అటు పార్టీల అధినేతలు ప్రచార పర్వంలోకి అడుగుపెట్టారు. అయితే అంతర్గతంగా కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ఈ విషయంలో వైసిపి ముందు జాగ్రత్తలు తీసుకుంది. అభ్యర్థులను మార్చినా అసమ్మతి లేకుండా చూసుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కానీ కూటమిలో తెలుగుదేశం పార్టీ సీట్లను త్యాగం చేసింది. దీంతో చాలామంది నాయకులకు అవకాశాలు లేకుండా పోయాయి. అటు జనసేన, బిజెపిలో అనుకున్న సీట్లు దక్కకపోవడంతో చాలామంది నేతలకు టిక్కెట్లు దక్కలేదు. దీంతో మూడు పార్టీలకు అసంతృప్తుల బెడద తప్పలేదు.
తెలుగుదేశం పార్టీ సైతం కొన్ని నియోజకవర్గాలను బిజెపితో పాటు జనసేనకు కేటాయించింది. అక్కడ టిడిపి బలంగా ఉంది. దీంతో నాయకులతో పాటు క్యాడర్ సహజంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. చాలాచోట్ల టిడిపి ఇన్చార్జిలు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి సీట్లు దాదాపు పది వరకు ఉన్నాయి. అక్కడ రెబల్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై పడింది. అందుకే హై కమాండ్ దూతలను నియమించింది. వారు ఇప్పుడు చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక బిజెపిలో అయితే దారుణ పరిస్థితులు ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేసే నాయకులకు అక్కడ సీట్లు దక్కలేదు. దీంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో తెర వెనుక వైసీపీకి సహకరించే పరిస్థితి కనిపిస్తోంది. కేవలం చంద్రబాబుకు అనుకూలమైన నేతలకు మాత్రమే బిజెపి టిక్కెట్లు వచ్చాయి అన్న విమర్శ ఉంది. దీంతో వారిని ఓడించేందుకు బిజెపి అసంతృప్తులు ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. దానిని బిజెపి హై కమాండ్ అధిగమించాలి.
జనసేన సైతం ఆశించిన సీట్లు దక్కించుకోలేక పోయిందన్న విమర్శ ఉంది. పవన్ తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని క్యాడర్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఇదివరకే జనసేనకు కేటాయించిన సీట్లను సైతం బిజెపికి సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీంతో ఎక్కడికక్కడే నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీని వీడేందుకు సైతం సిద్ధపడుతున్నారు. వారిని ఇతర పార్టీలకు వెళ్లకుండా చూడాలి. వారి వెంట క్యాడర్ వెళ్లకుండా ఆపాలి. ఓట్ల బదలాయింపుకు సంబంధించి సరైన వ్యూహం రూపొందించాలి. ముందుగా ఈ వీటిని గాడిలో పెట్టుకుని ఈ మూడు పార్టీలు ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. లేకుంటే మాత్రం పొత్తు ప్రయోజనం కంటే విఘాతం కల్పిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.