Cricket Ball : తగలరాని చోట క్రికెట్ బంతి తగిలింది.. బాలుడు మృతి

అప్పటికే ఆ బాలుడు కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖంలో కూరుకుపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాలుడు పూణేలోని రామన్ బాగ్ ప్రాంతంలో ఓ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు.

Written By: NARESH, Updated On : May 6, 2024 5:03 pm

Boy dies after being hit by a Cricket Ball

Follow us on

Cricket Ball : మనిషి జీవితం ఒక నీటి బుడగ ప్రాయం. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో.. ఎలాంటి ప్రమాదాలు ప్రాణాలు తీస్తాయో ఎవరూ గుర్తించలేరు. అప్పటిదాకా బాగున్నవారు కళ్ళముందే చనిపోతున్నారు. అప్పటిదాకా మనతో మాట్లాడిన వారు, క్షణాల్లో ఆసుపత్రి పాలవుతున్నారు. చికిత్స అందిస్తుండగానే కాలం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మానియా దేశాన్ని ఊపేస్తోంది. సెలవులు కావడంతో యువత క్రికెట్ స్టేడియాలకు పరుగులు పెడుతున్నారు. మనదేశంలో క్రికెట్ అంటే ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు క్రికెట్ అంటే ఇష్టపడుతుంటారు. అయితే క్రికెట్ ఆడే సమయంలో కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అవి ఏ రూపంలో ముంచుకొస్తాయో మనకు తెలియదు. అప్పట్లో టీమిండియా కెప్టెన్ సబా కరీం అనే వికెట్ కీపర్ బంతి తగిలి.. తీవ్రంగా గాయపడ్డాడు. చివరికి తన కెరియర్ కోల్పోయాడు.. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పిల్లలు మైదానాలలో ఆటలాడుతున్నారు. ఈత, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్ వంటివి ఆడుతూ సేద తీరుతున్నారు. పాఠశాలల్లో మైదానాలు లేకపోవడం.. ఒకవేళ మైదానాలు ఉన్నా.. ఆడేంత సమయం లేకపోవడంతో.. చాలామంది పిల్లలు ఆటలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో పిల్లలు ఉత్సాహంగా మైదానాలలో ఆటలు ఆడుతున్నారు. అలా ఓ ఇండోర్ స్టేడియంలో కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. ఈ ప్రమాదంలో 11 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

పూణే ప్రాంతానికి చెందిన 11 సంవత్సరాల బాలుడు క్రికెట్ ఆడుతుండగా.. అతడి మర్మాంగాలకు బంతి తగిలి దుర్మరణం చెందాడు. మృతిచెందిన బాలుడు పేరు శౌర్య కాళిదాస్ ఖాండ్వే. గురువారం పూణేలోని లోహేగావ్ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. వేగంగా దూసుకొచ్చిన బంతి ఆ బాలుడి మర్మాంగాలకు తగలడంతో, అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయపడిపోయిన తోటి స్నేహితులు ఆ విషయాన్ని అక్కడున్న పెద్దలకు చెప్పారు. దీంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆ బాలుడు కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖంలో కూరుకుపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాలుడు పూణేలోని రామన్ బాగ్ ప్రాంతంలో ఓ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు.