Bhuvneshwar Kumar underrated : సరిగ్గా ఇలాంటి అద్భుతాన్ని చేసి చూపించాడు భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ ఈ సీజన్లోనే కన్నడ జట్టులోకి వచ్చాడు. తను ఎంత స్పెషలో.. కష్ట కాలంలో ఎలాంటి బంతులు వేస్తాడు కన్నడ జట్టుకు లైవ్లో చూపించాడు. అందువల్లే అతడిని ప్రతి మ్యాచ్లో ఆడించాడు కన్నడ జట్టు సారధి. చివరికి ఫైనల్ మ్యాచ్లోను అతనితో పదేపదే ఓవర్లు వేయించాడు. మొత్తంగా అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు. వాస్తవానికి భువనేశ్వర్ కుమార్ స్లో బంతులు వేయడంలో దిట్ట. పైగా వాటిని మెలి తిప్పి వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. అందువల్లే అతడిని స్లో మాన్స్టర్ అని పిలుస్తుంటారు.. ఈ ఏడాది జరిగిన వేలంలో కావ్య జట్టు అతడిని వద్దనుకొంది. కన్నడ జట్టు మాత్రం కావాలనుకుంది. మొత్తంగా భారీ ధరకు అతడిని దక్కించుకొని.. తనకు తగ్గట్టుగా ఫలితాన్ని రాబట్టుకుంది.
అయ్యర్ సేనతో జరిగిన చివరి పోటీలో గెలిచిన తర్వాత మీడియా, సోషల్ మీడియాలో విరాట్ గురించి, హార్దిక్ సోదరుడి గురించి తామర తంపరగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే లెక్కేలేదు.. అయితే ఇలాంటి పరిస్థితిలో భువనేశ్వర్ కుమార్ గురించి అందరూ మర్చిపోతున్నారు. వాస్తవానికి కన్నడ జట్టు ఒక్కసారిగా మ్యాచ్ మీద పట్టు సాధించింది అంటే దానికి ప్రధాన కారణం భువనేశ్వర్ కుమార్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ఎందుకంటే అయ్యర్ జట్టు చేతిలోకి మ్యాచ్ వెళ్లకుండా కాపాడింది ముమ్మాటికి భువనేశ్వర్ కుమారే.
ప్రారంభం నుంచి మ్యాచ్ రెండు జట్లకు అనుకూలంగా ఉంది. ఈ దశలో అయ్యర్ సేన కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ ఎదురుదాడిని మాత్రం నిలుపుదల చేయలేదు. దీంతో మ్యాచ్ గెలిచేలా పంజాబ్ జట్టు కనిపించింది. ఈ దశలో 17 ఓవర్ వేసే బాధ్యతను కన్నడ జట్టు సారథి భువికి అప్పగించాడు. దీంతో అతడు లెక్కలు వేసుకుంటూ బంతులు వేశాడు. అదే ఓవర్లో నేహల్ వదేరా, స్టోయినీస్ ను వెనక్కి పంపించాడు. దీంతో కన్నడ జట్టు విజయం ఖాయమైంది. ఒకవేళ వీరిద్దరూ గనుక అలాగే నిలబడి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. భువి స్లో బంతులను వేసి ప్రమాదకరమైన ప్లేయర్లను వెనక్కి పంపించాడు. దీంతో కన్నడ జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్ దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో పంజాబ్ కన్నడ జట్టు ఎదుట తలవంచక తప్పలేదు. మొత్తంగా కన్నడ జట్టు సాధించిన విజయంలో భువి అత్యంత కీలకపాత్ర పోషించాడు.