https://oktelugu.com/

Ben Duckett: ఐపీఎల్లో అన్ సోల్డ్.. సీన్ కట్ చేస్తే ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టాడు.. వీడియో వైరల్..

అతడు అద్భుతమైన ఆటగాడు. ఇంగ్లాండ్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. దూకుడైన బ్యాటర్ గా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అటువంటి ఆటగాడు ప్రస్తుతం బిగ్ బాష్ సూపర్ లీగ్ లో అదరగొడుతున్నాడు. అనితర సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 26, 2024 / 05:18 PM IST

    Ben Duckett

    Follow us on

    Ben Duckett: బిగ్ బాష్ లీగ్ లో భాగంగా సిడ్ని సిక్సర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో మెల్ బోర్న్ స్టార్స్ ఆటగాడు బెన్ డకెట్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. సిడ్ని సిక్సర్స్ బౌలర్ అఖిల్ హోసెన్ వేసిన ఒక ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టాడు. 29 బంతులు ఎదుర్కొన్న డకెట్ 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 రన్స్ చేశాడు. మైదానంలోకి రావడం ఆలస్యం డకెట్ బ్యాట్ తో వీర విహారం చేశాడు. బౌలర్ ఎవరైనా సరే ఏమాత్రం లెక్కపెట్టకుండా దూకుడుగా ఆడాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా ఫోర్లు కొట్టాడు. జెర్సీ వేసుకున్నంత సులభంగా సిక్సర్లు కొట్టాడు. అతడి దూకుడుకు మెల్బోర్న్ స్టార్స్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు 68 పరుగులు చేశాడంటే.. అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పి.. జట్టుకు భారీ స్కోరు అందించడంలో డకెట్ విజయవంతమయ్యాడు.

    టి20లలో వేగవంతమైన ఆటగాడిగా.. మెరుపు ఇన్నింగ్స్ నిర్మించే ప్లేయర్ గా పేరుపొందిన డకెట్ ను ఇటీవల జరిగిన ఐపిఎల్ మెగా వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అతడు తన బేస్ ప్రైస్ 10 లక్షలుగా ప్రకటించినా ఏ యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. దీంతో అతడు ఐపీఎల్లో అమ్ముడుపోని ఆటగాడిగా చెత్త రికార్డు సృష్టించాడు. డకెట్ ను ఎవరూ కొనుగోలు చేయలేకపోవడంతో అతడు నిరాశగా వెనుతిరిగాడు. ఐపీఎల్ లో తనను కొనుగోలు చేయకపోవడంతో.. ఆ బాధను మొత్తం అతడు బిగ్ బాష్ లీగ్ లో చూపిస్తున్నాడు. తన కెరియర్ లోనే అద్భుతమైన ఫామ్ లో అతడు ఉన్నాడు. మైదానంలోకి రావడమే ఆలస్యం.. బౌండరీ లో వర్షం కురిపిస్తున్నాడు. సిక్సర్ల హోరును ప్రదర్శిస్తున్నాడు. అతని బ్యాటింగ్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ” ఐపీఎల్ లో అతడు అమ్ముడు పోలేదని తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తున్నది .. పెద్దగా ఇబ్బంది లేదు. అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మైదానంలో వీరవిహారం చేస్తున్నాడు. అతడు గొప్ప ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ఇదే ఊపు కనుక కొనసాగిస్తే అతడికి తిరిగు ఉండదు. టి20 క్రికెట్ లీగ్ లో అతడు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఇకముందు అతని ఆటను ఆస్వాదించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మరింత సమర్థవంతమైన ఆటతీరుని డకెట్ ప్రదర్శించాలని కోరుతున్నాం.. అతడు జాతీయ జట్టులోనూ ఇలానే అలరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని ” అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు.