BCCI Vs Sarfaraz Khan: భారత్ లో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. చిన్నప్పటి నుంచి సినిమా హీరోలను, క్రికెటర్లను చూసి పెరిగే ఎంతోమంది తమ జీవిత లక్ష్యాలుగా వీటిల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుంటున్నారు. మెజారిటీ మాత్రం క్రికెట్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇతర క్రీడల పట్ల మక్కువ పెరుగుతున్నప్పటికీ క్రికెట్ కు దేశంలో ఉన్న ఆదరణ దృష్ట్యా ఎక్కువ మంది మాత్రం ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. భారత్ వంటి దేశంలో 11 మంది మాత్రమే ఆడే క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ఆషామాషీ విషయం కాదు. దీనికి ఎంతగానో శ్రమించాలి. అద్భుతమైన ఆట తీరే కాదు.. అంతకుమించిన క్రమశిక్షణ, శారీరక ఫిట్నెస్ చాలా అవసరం.
ఇండియన్ క్రికెట్ లో జట్టు సంపాదించడం కోసం దేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. కొన్ని లక్షల మంది కల కూడా ఇది. అయితే, ఈ కలను సాకారం చేసుకునేది అతి కొద్ది మంది మాత్రమే. దీనికి వాళ్లు ఎంతగానో శ్రమిస్తుంటారు. అయితే, ఆ శ్రమకు తగిన ప్రతిఫలం క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలతోనే సాధ్యమవుతుంది. అయితే, ఎంతోమంది ప్రతిభ ఉన్నప్పటికీ క్రమశిక్షణ లేకపోవడం, ఫిట్నెస్ కలిగి ఉండకపోవడం వల్ల భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులో చోటు దక్కుతుందని భావించిన ముంబై కి చెందిన సర్పరాజ్ ఖాన్ ఇటువంటి లోపాల వల్లే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో భారత జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న ఆటగాళ్లు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ వ్యవహారం నొక్కి చెబుతోంది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో..
భారత వంటి జట్టులో చోటు దక్కించుకునే ఆటగాడు శారీరకంగా ఫిట్ గా ఉండాలి. ఈ విషయాలను సెలక్టర్లు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉండి, వరుస రంజీ సీజన్లలో 900 కు పైగా పరుగులు చేసి సత్తాను చాటిన సర్పరాజ్ ఖాన్ ను బీసీసీఐ వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు. సర్ఫరాజ్ కు బదులు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేశారు. రుతురాజ్ కంటే అద్భుతమైన ఫామ్ లో ఉన్న సర్పరాజ్ ను ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, సర్పరాజ్ ఖాన్ ను ఎంపిక చేయకపోవడానికి బలమైన కారణం ఉన్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న సర్పరాజ్ ఖాన్ ను ఎంపిక చేయకపోవడానికి సెలక్టర్లు ఏమైనా ఫూల్స్ అనుకుంటున్నారా..? అని బీసీసీఐకి చెందిన ఒక అధికార ప్రశ్నించారు. వెస్టిండీస్ పర్యటనకు అతడిని పరిగణలోకి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అతడు ఫిట్నెస్ అని ఆ అధికారి వెల్లడించాడు. బ్యాట్ తో రాణించడంతోపాటు ఆఫ్ ది ఫీల్డ్ లో అతడి ప్రవర్తన కూడా సరిగ్గా లేదని, ఈ విషయాలన్నీ తాము గమనిస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించాడు. కొంచెం క్రమశిక్షణతో ఉండాలని, సర్పరాజ్ ఖాన్ తండ్రి ఈ విషయాలను గమనిస్తాడని భావిస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించడం గమనార్హం.
బ్యాటింగ్ పైనే దృష్టి.. మిగిలిన వాటిపై నిర్లక్ష్యం..
సర్పరాజ్ ఖాన్ మాదిరిగానే ఎంతో మంది క్రికెటర్లు బ్యాట్ తో పరుగులు వరద పారిస్తే టీమిండియాలో చోటు ఖాయంగా భావిస్తున్నారు. బొద్దుగా తయారవుతున్న, పొట్ట పెరిగిపోతున్న పట్టించుకోవడం లేదు. జట్టుతో ఉన్నప్పుడు క్రమశిక్షణ కూడా చాలా అవసరం. అటువంటి విషయాలను చాలామంది ఆటగాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్ వంటి జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ల వ్యవహార శైలి కూడా చాలా కీలకంగా ఉంటుంది. సెలక్టర్లు ఆటతోపాటు మిగిలిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి వారిని ఎంపిక చేస్తున్నారు. కాబట్టి భారత జట్టులోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆటగాళ్లు ఫిట్నెస్ తోపాటు క్రమశిక్షణను కలిగి ఉండాలని, అంతే, స్థాయిలో బ్యాటింగ్, బౌలింగ్ లో ప్రతిభ చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే భారత జట్టులో చోటు ఖాయమవుతుంది.