BCCI vs PCB : ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన పంతాన్ని నెగ్గించుకుంది. పాకిస్తాన్లో అడుగుపెట్టకుండా.. కేవలం దుబాయ్ లో మాత్రమే ఆడి..ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శనను నిలుపుదల చేయించింది. చివరికి తన జాతీయ జెండాను ఎగరవేయకుండా తల బిరుసుతనాన్ని ప్రదర్శించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఐసీసీ ద్వారా చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది. ఇన్ని మాస్టర్ స్ట్రోక్ లు సరిపోవనుకుందేమో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు బిసిసిఐ మరో షాక్ ఇచ్చింది.
ఆసియా కప్ నిర్వహణ సంబంధించి బంగ్లాదేశ్ రాజధాని లో సమావేశం నిర్వహించాలని భావించారు. ఈ సమావేశానికి బీసీసీఐ హాజరు కాబోనని చెప్పేసింది. దీని వెనక కారణం లేకపోలేదు. ఆసియా కప్ నిర్వహణ సంబంధించి చేపట్టే సమావేశ వేదికను మార్చాలని బీసీసీఐ కొద్దిరోజులుగా పట్టుబడుతోంది. ఒకవేళ వేదికను గనుక మార్చకపోతే టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోతామని బీసీసీఐ పెద్దలు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. భారత్ – బంగ్లా మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
” హాస్య క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ కొనసాగుతున్నారు. ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశాన్ని ఢాకా లో నిర్వహించాలని పట్టుబడుతున్నారు. అక్కడ నిర్వహించే సమావేశానికి మేము హాజరుకాం. ఆ వేదికను మర్చిపోయిన ఆసియా కప్ నిర్వహణ సాధ్యమవుతుంది. అంతే తప్ప భారత్ మీద అనవసరమైన ఒత్తిడి తీసుకొస్తే ఉపయోగం లేదు. ఆసియా కప్ కోసం నఖ్వీ ఉపయోగం లేని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఢాకాలో సమావేశం జరిగితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుందని” ఓ నివేదిక వెల్లడించింది.
అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఇతర బోర్డుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఒమన్ దేశాల క్రికెట్ బోర్డులు భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నఖ్వీ మొండి పట్టుదలకు పోతున్నారు. ఒకవేళ ఈ సమావేశానికి భారత్ హాజరు కాకపోతే ఆసియా క్రికెట్ కప్ జరిగే అవకాశం ఉండదు.. ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కచ్చితంగా సమావేశం నిర్వహించాలి అనుకుంటే.. దానికి ఎటువంటి అర్థం ఉండదు. ఈ సమావేశం నిర్వహణకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
భారత్ కనుక ఇదే దూరాన్ని కొనసాగిస్తే ఆసియా కప్ రద్దయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఈ టోర్నీ జరగాలి. ఒకవేళ పరిస్థితులు ఇలాగే ఉంటే టోర్నీ వాయిదా లేదా రద్దయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసియా క్రికెట్ కౌన్సిల్లో అత్యంత కీలకమైనది. ఒకవేళ ఈ సమావేశంలో బీసీసీఐ పెద్దలు పాల్గొనకుండా పరిస్థితులు వేరే విధంగా మారిపోతాయి. అప్పుడు టోర్నీ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటాయి.