Gautam Gambhir: దక్షిణాఫ్రికా జట్టు తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను ఇండియా కోల్పోయింది. స్వదేశం వేదికగా ఏడాది వ్యవధిలోనే రెండవ వైట్ వాష్ కు గురైంది. వాస్తవానికి టీం ఇండియాలో పర్యటించాలంటే ఏ జట్టు అయినా సరే భయపడేది. చివరికి ఆస్ట్రేలియా సైతం ఇబ్బంది పడిపోయేది. అటువంటిది ఇండియాలో న్యూజిలాండ్ జట్టు వైట్ వాష్ చేస్తే.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు దానిని కొనసాగించింది.
దక్షిణాఫ్రికా జట్టు చేతిలో దారుణమైన ఓటమి ఎదురైన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ మీద నెటిజన్లు, అభిమానులు తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన నాటి నుంచి టీమిండియాలో పరిస్థితి దారుణంగా మారిపోయిందని.. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో భారత జట్టు ప్లేయర్లు అత్యంత నాసిరకమైన ప్రదర్శన చేస్తున్నారని మాజీ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. దినేష్ కార్తీక్ తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో జట్టులో లోపాల గురించి.. గౌతమ్ గంభీర్ వైఫల్యాల గురించి స్పష్టంగా చెప్పాడు. అతడు చేసిన వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవించారంటే జట్టులో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టీమిండియా వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద మేనేజ్మెంట్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అతడిని బయటికి పంపిస్తారని మాజీ క్రికెటర్లు సైతం వ్యాఖ్యానించారు. అయితే అతనిపై ఇప్పట్లో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన ఒక అధికారి వెల్లడించినట్టు ప్రఖ్యాత ఎన్డిటీవీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. జట్టులో మాత్రం మార్పులు జరుగుతాయని.. కొంతమంది ప్లేయర్లను పక్కన పెడతారని.. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించే ప్లేయర్లకు అవకాశాలు కల్పిస్తారని ఆ అధికారి చెప్పినట్టు ఎన్డిటీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. కోచ్ మార్పు విషయంలో ఇప్పటివరకు మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆ కథనంలో ఎన్డిటీవీ పేర్కొంది.
టీమిండియా వరుసగా టెస్ట్ సిరీస్లను కోల్పోతున్న నేపథ్యంలో.. స్వదేశంలో వైట్ వాష్ లకు గురవుతున్న క్రమంలో గౌతమ్ గంభీర్ ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కొంతమంది మాజీ క్రికెటర్లు ఆ డిమాండ్లకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. చివరికి కోచ్ తొలగింపు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మేనేజ్మెంట్ ప్రకటించిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిని బలపరిచేలాగా ఎన్డిటీవీ కథనం ఉండడం విశేషం.