IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది..లైవ్ మ్యాచ్ లు ఓటీటీ, టీవీ లలో ప్రసారమవుతున్నాయి. వ్యూ యర్ షిప్ విషయంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కొన్ని జట్లు మినహా మిగతా అన్ని మ్యాచ్ ల్లో మైదానాలు అభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ఆటగాళ్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతుండడంతో అభిమానులు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు అత్యధిక స్కోరు సాధించిన టీం గా చరిత్ర సృష్టించింది. హోరాహోరిగా మ్యాచ్ లు సాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ ప్రాంచైజీలతో బీసీసీఐ ఏప్రిల్ 16న అహ్మదాబాద్ లో భేటీ కానుంది. ఈ మేరకు అన్ని యాజమాన్యాలకు బీసీసీఐ వర్తమానం పంపింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధూమల్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా వచ్చే ఏడాది ఎడిషన్ కి సంబంధించి మెగా వేలం గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వేలానికంటే ముందు ఆటగాళ్ల రి టెన్షన్ విధానంపై ఆయా జట్ల యాజమాన్యాలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు రిటైన్ ఆటగాళ్ల సంఖ్య 8 కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని జట్లు దానిని వ్యతిరేకిస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ కు ముందు నిర్వహించిన చివరి వేలంలో ఒక్కో జట్టుకు నలుగురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది.
17వ సీజన్ కు సంబంధించి ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. శ్రీరామనవమి నేపథ్యంలో ఈ మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది..కోల్ కతా లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటేలా నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం కావడం.. ఇటీవల ఆ రాష్ట్రంలో గొడవలు జరగడం.. పోలీసులు ఈసారి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల సందడి ఆ రాష్ట్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకల బందోబస్తుకు పోలీసులను భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం శాఖ ప్రకటించింది. దీంతో ఆ రోజు జరిగే మ్యాచ్ కు ఆశించినత స్థాయిలో భద్రత కల్పించడం సాధ్యం కాదని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఐపీఎల్ నిర్వాహకులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే మరికొద్ది రోజుల్లో ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.