BCCI Women Players: టీమిండియా మహిళలు వన్డే వరల్డ్ కప్ గెలిచారు. దశాబ్దాల కలను నిజం చేశారు.. స్వదేశంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని అందుకున్నారు. తద్వారా నూరుకోట్లకు మించిన భారతీయుల ఆకాంక్షకు బలాన్ని ఇచ్చారు.. ఈ గెలుపు ద్వారా భవిష్యత్తు కాలంలో చాలామంది అమ్మాయిలు క్రికెట్ ను ఒక కెరియర్ గా ఎంచుకుంటారు..
టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవడంతో బీసీసీఐ స్పందించింది.. ఏకంగా 51 కోట్ల నజరానా ప్రకటించింది. ప్రైస్ మనీ గా టీం ఇండియాకు 39 కోట్లు వచ్చాయి.. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. బీసీసీఐ మహిళా ప్లేయర్లకు ఇస్తున్న ఫీజు విషయమే చాలా ఇబ్బందికరంగా ఉంది.. ఈ ఏడాది మార్చిలో బీసీసీఐ వార్షిక ప్లేయర్ రిటైన్ షిప్ ను విడుదల చేసింది.. ఇందులో భాగంగా మహిళ ప్లేయర్లను మూడు విభాగాలుగా విభజించింది. ఇందులో గ్రేడ్ ఎ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్లకు సంవత్సరానికి 50 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తుంది.. గ్రేడ్ ఏ వి భాగంలో కెప్టెన్ హర్మన్ , స్మృతి మందాన, దీప్తి శర్మ ఉన్నారు. బి గ్రేడ్ లో రేణుక, జమీమా, రిచా, షఫాలీ వంటి వారు ఉన్నారు. వీరికి ఏడాదికి 30 లక్షల చొప్పున వేతనం లభిస్తుంది. ఇక సీ గ్రేడ్ లో రాధా, అమన్ జ్యోత్ కౌర్, ఉమా, స్నేహ్ రాణా, ప్లేయర్లకు 10 లక్షల చొప్పున వేతనం లభిస్తుంది.
ఈ వేతనాలను పురుష ప్లేయర్లతో పోల్చి చూస్తే విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న పురుషుల జట్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ ను బిసిసిఐ విడుదల చేసింది. ఈ ప్రకారం ఏ+ గ్రేడ్ ప్లేయర్లకు ఏడు కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్లకు ఐదు కోట్లు, బి గ్రేడ్ ప్లేయర్లకు మూడు కోట్లు, సి గ్రేడ్ ప్లేయర్లకు కోటి రూపాయల వరకు వేతనం బీసీసీఐ చెల్లిస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే మహిళల జట్టులో ఏ గ్రేడ్ ప్లేయర్లకు వేతనం కేవలం 50 లక్షలు మాత్రమే లభిస్తుంది. మ్యాచ్ ఫీజుల విషయంలో మాత్రం బీసీసీఐ వివక్షను చూపించడం లేదు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు, వన్డేకు ఆరు లక్షలు , టి20 మ్యాచ్ కు మూడు లక్షల చెల్లిస్తోంది. అయితే పురుషుల జట్టుకు ప్రతి ఏడాది ఎక్కువగా మ్యాచ్ లు ఉంటాయి కాబట్టి వారికి ఆదాయం భారీగా లభిస్తోందని బిసిసిఐ చెబుతోంది. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మ్యాచ్ ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
మహిళ ప్లేయర్ల విషయంలో బిసిసిఐ పెద్దగా వివక్ష చూపించడం లేదని.. మిగతా జట్లతో పోల్చి చూస్తే భారత మహిళలకు భారీగానే ఫీజు చెల్లిస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంకా మరిన్ని మ్యాచులు నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుందని చెబుతున్నారు. మహిళల క్రికెట్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని.. మరి కొద్దిరోజులు ఆగితే సూపర్ ఫామ్ లోకి వస్తుందని బీసీ సీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.