Mayank Yadav: లక్నో జట్టు తరఫున ఐపీఎల్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు మాయాంక్ యాదవ్. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టి20 వరల్డ్ కప్ జట్టులో అతనికి స్థానం లభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాయాంక్ యాదవ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది..
మాయాంక్ యాదవ్ స్పీడ్ బౌలింగ్ ను దృష్టిలో పెట్టుకొని అతడికి భారత క్రికెట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి కోటి రూపాయల విలువైన కాంట్రాక్టు ఇచ్చి.. అద్భుతమైన బౌలర్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వార్షిక కాంట్రాక్టు లేకపోయినప్పటికీ.. మెరిట్ ఉన్న ఫాస్ట్ బౌలర్లకు రూ. కోటి చొప్పున ఇస్తూ.. వారి బౌలింగ్ లో నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమానికి బీసీసీఐ ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టింది. ఉమ్రాన్ మాలిక్, విద్వత్ కావేరప్ప, వ్యాషక్ విజయ్ కుమార్, యష్ దయాల్, ఆకాష్ దీప్ వంటి బౌలర్లు కోటి రూపాయల కాంట్రాక్ట్ లో ఉన్నారు. వీరి పరిధిలో మయాంక్ ను కూడా చేర్చాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఈ కాంట్రాక్ట్ ద్వారా మయాంక్ యాదవ్ కు అత్యద్భుతమైన చికిత్స లభిస్తుంది. నాణ్యమైన నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ అందుతుంది. బలవర్ధకమైన ఆహారం లభిస్తుంది. ఆదివారం రాత్రి కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో లక్నో ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి దిగజారింది. ఒకవేళ లక్నో ప్లే ఆఫ్ చేరుకుంటే మయాంక్ యాదవ్ తిరిగి జట్టులోకి వస్తాడు. లేకుంటే అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లిపోతాడు. టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత, ఆస్ట్రేలియా తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం మయాంక్ యాదవ్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అప్పటిలోగా అతడిని నాణ్యమైన పేస్ బౌలర్ లాగా తయారు చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.
వాస్తవానికి ఈ ఐపీఎల్లో మయాంక్ యాదవ్ ప్రస్థానం 20 లక్షలతో మొదలైంది. అతడి బౌలింగ్ నచ్చడంతో బీసీసీఐ పెద్దలు కోటి రూపాయల కాంట్రాక్టు ఇచ్చేశారు. గతంలో ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగంగా బౌలింగ్ వేసేవాడు. ఐపీఎల్ లో కూడా అతడి పేరు మీద రికార్డులు ఉండేవి. ఆ రికార్డును ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్లోనే మయాంక్ యాదవ్ అధిగమించాడు. గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి విసిరిన చరిత్ర ఆస్ట్రేలియా బౌలర్ షాన్ టైట్ పేరు మీద ఉండేది. అతడు 157.7 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు. అతడి తర్వాత ఉమ్రాన్ మాలిక్, మాయాంక్ యాదవ్ ఉన్నారు. కేవలం 21 సంవత్సరాల వయసులోనే అద్భుతంగా బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్న మాయాంక్ యాదవ్ పై సీనియర్ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ అయితే.. భారత జట్టుకు సరికొత్త అస్త్రం దొరికిందని అప్పట్లో కితాబిచ్చాడు. ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో, 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు తీశాడు. ఈ నాలుగు ఓవర్లలో ఒక్క వైడ్ లేదా నోబాల్ వేయకుండా 17 డాట్ బాల్స్ వేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.