BCCI offer to Dravid son: రాహుల్ ద్రావిడ్.. టీమిండియా టెస్ట్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసిన ఆటగాడు ఇతడు.. ఆటగాడిగా మాత్రమే కాకుండా.. శిక్షకుడిగా కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు ద్రావిడ్. ఇతడి శిక్షణలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. 2007 తర్వాత దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం భారత్ t20 వరల్డ్ కప్ అందుకుంది.
రాహుల్ ద్రావిడ్ గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. వైభవ్ సూర్య వంశీని రాజస్థాన్ జట్టులోకి తీసుకువచ్చింది ఇతడే. అతడికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఈ స్థాయిలో బ్యాటింగ్ చేసే విధంగా రూపొందించింది కూడా ఇతడే. అదే విషయాన్ని సూర్య వంశీ అనేక సందర్భాల్లో చెప్పాడు. తాను లావు తగ్గడానికి రాహుల్ ద్రావిడ్ సార్ ఇచ్చిన శిక్షణ ఉపకరించిందని సూర్య వంశీ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. అదే అతని కుమారుడికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు విపరీతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అతడి కుమారుడికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
భారత అండర్ 19 జట్టు త్వరలో శ్రీలంకలో పర్యటించబోతోంది. భారత జట్టుకు యష్ వర్ధన్ సింగ్ చౌహన్ నాయకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ జట్టులో రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కు చోటు లభించినట్టు తెలుస్తోంది.. భారత జట్టుకు ఇతడు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తాడు. ఇతడి వయసు 16 సంవత్సరాలు.
అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో ఒక ఆటగాడిని కూడా ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఈ పర్యటనలో కొత్తజట్టును తీర్చిదిద్దడానికి బీసీసీఐ సన్నాహకాలు చేపట్టిందని తెలుస్తోంది. ఆల్ రౌండర్లకే మేనేజ్మెంట్ పెద్దపీట వేసింది. గత ఏడాది అన్వయ్ అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.. ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 జట్టుతో నాడు భారత బీ జట్టు ఆడింది. అప్పుడు భారత బీ జట్టులో అతడు కీలక ఆటగాడు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన ఈ సిరీస్లో అన్వయ్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అమీరి చేతిలో తొలి బంతికే అవుట్ అయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం ఇతడు సత్తా చూపిస్తున్నాడు. వికెట్ కీపర్ గా.. బ్యాటర్ గా అదరగొడుతున్నాడు.
జట్టు వివరాలు ఇవే
ఇషాన్ సూద్, సాగర్, రాయచందాని, చౌహన్, వినీత్, అర్జున్, కుషాగ్ర, రజత్, అన్వయ్, అన్మోల్జిత్ సింగ్, యశ్వీర్, రోహిత్, కావ్య పరేష్, మోహిత్ ఉల్వ.
ఈ సిరీస్లో భాగంగా 3 వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరుగుతాయి. హంబన్ టోటా వేదికగా భారత్ 3 వన్డేలు ఆడుతుంది. గాలి వేదికగా జూలై 13 నుంచి 16, కొలంబ వేదికగా జూలై 20 నుంచి 23 మధ్య రెండు యూత్ టెస్టులు జరుగుతాయి.

