IND Vs BAN Test Match : సహజంగా భారతదేశంలోని మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటాయి. అయితే చెన్నై మైదానాన్ని తొలిసారిగా బ్లాక్ సాయిల్ కు బదులుగా రెడ్ సాయిల్ తో రూపొందించారు.. దీంతో బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతోంది. అంచనాలకు అందని విధంగా టర్న్ అవుతోంది. దీంతో బ్యాటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. తొలి రోజు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు దిగడానికి ముందు భారత జట్టు 144/6 వద్ద ఉందంటే దానికి కారణం బంతి టర్న్ కావడమే. ఈ మైదానంపై స్పిన్నర్లు చెలరేగుతారనుకుంటే.. పేస్ బౌలర్లు పండగ చేసుకున్నారు. ఈ దశలోనే బంగ్లాదేశ్ బౌలర్లు ఎక్కువ వికెట్లు సాధించారు. చెన్నై మైదానంపై సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్లు పది వికెట్లు సొంతం చేసుకున్నారు. ఇవన్నీ కూడా పేస్ బౌలర్లు పడగొట్టడం విశేషం. 2001లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లోనూ బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు 9 వికెట్లు సొంతం చేసుకున్నారు. అదే ఏడాది హామీల్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లోనూ బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు 9 వికెట్లు సొంతం చేసుకున్నారు.. 2005లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు 9 వికెట్లు దక్కించుకున్నారు. మౌంట్ మౌంట్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో 2022లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలర్లు 9 వికెట్లు సాధించారు. 2024 లో చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు 9 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
అరుదైన ఘనత
ఇక ఈ మ్యాచ్ ద్వారా బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహమూద్ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. తొలి రోజు నాలుగు వికెట్లు సాధించిన ఇతడు.. రెండవ రోజు మరో వికెట్ దక్కించుకొని 5 వికెట్ హాల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే భారత జట్టుపై టెస్టులలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బంగ్లాదేశ్ బౌలర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. 2000 సంవత్సరంలో ఢాకా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో నైమూర్ రెహమాన్ 6/132 గణాంకాలు నమోదు చేశాడు. చటోగ్రామ్ వేదికగా 2010లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో షాకీబ్ అల్ హసన్ 5/62, 2022 లో మీర్పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో మెహదీ హాసన్ మిరాజ్ 5/63, చటో గ్రామ్ వేదికగా 2010లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో షహదత్ హొస్సేన్ 5/71, 2024 లో చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో హసన్ మహమూద్ 5/83 గణాంకాలు నమోదు చేశారు. 2019లో ఇండోర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలర్ అబు జయేద్ 4/108 గణాంకాలు నమోదు చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో 5 వికెట్ హాల్ ను అత్యధిక సార్లు షహదత్ హొస్సేన్ సాధించాడు. ఇతడు ఐదు వికెట్ల ఘనతను నాలుగుసార్లు అందుకున్నాడు.. రోబియుల్ ఇస్లాం రెండుసార్లు, హసన్ మహమూద్ రెండుసార్లు 5 వికెట్ల ఘనతను సాధించారు.