Babar Azam: తోపన్నారు. తురుమన్నారు. అదరగొడతాడన్నారు. అడ్డు లేదన్నారు. మావాడు హీరో మిగతా వాళ్ళంతా జీరో అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగలేదు.. పాకిస్తాన్ జట్టులో విరాట్ కోహ్లీ అన్నారు. అక్కడ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాకీ లు పెట్టి లేపింది. కానీ అతడేమో ఆ స్థాయిలో ఆడలేక పోతున్నాడు. పరుగులు చేయడం పక్కనపెట్టి సున్నాలతో పోటీ పడుతున్నాడు. స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లో కూడా అతడు విఫలమయ్యాడు.. ఆ ఆటగాడి పేరు బాబర్ అజాం.
Also Read: ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో కోర్టుకు ఏపీ ప్రభుత్వం!
మొదట్లో బాబర్ బాగానే ఆడేవాడు. పరుగులు బాగానే చేసేవాడు. కానీ ఆ తర్వాత అతని ఆట పూర్తిగా మారిపోయింది. ఒకప్పటి లయ అందుకోలేక.. జట్టుకు అవసరమైన పరుగులు చేయలేక.. ఇబ్బంది పడుతున్నాడు. అతడిని జట్టు లో ఉంచితే ఉపయోగముండదని భావించిన మేనేజ్మెంట్ దూరం పెట్టింది. కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టింది. అయితే తన ఆట ద్వారా జట్టు మేనేజ్మెంట్ మనసును గెలుచుకోవాల్సిన బాబర్.. సరిగా ప్రాక్టీస్ కూడా చేయలేదు. జట్టు ఆట కూడా బాగోలేకపోవడంతో మేనేజ్మెంట్ ఒక అడుగు కిందికి దిగి.. మళ్లీ బాబర్ ను జట్టులోకి తీసుకుంది. అయినప్పటికీ అతని ఆట తీరు ఏ మాత్రం మారలేదు.
ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా టీం ఇండియాతో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు. దీంతో బాబర్ పై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అయినప్పటికీ మేనేజ్మెంట్ అతని మీద నమ్మకం ఉంచింది. టీ 20 లలో మళ్లీ అవకాశం కల్పించింది. కానీ అతడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు . పాకిస్తాన్ జట్టులో సూపర్ బ్యాటర్ గా పేరుపొందిన అతడు.. ఇప్పుడు మాత్రం సున్నాల రాయుడిగా పేరు తెచ్చుకున్నాడు.. గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోగా.. జట్టుకు భారంగా మారుతున్నాడు. పాకిస్తాన్ వేదిక గా దక్షిణాఫ్రికా జట్టు పాక్ తో 3 టి20 ల సిరీస్ ఆడుతోంది. దీనికంటే ముందు టెస్ట్ సిరీస్ జరిగింది . అందులో పాక్ తొలి టెస్ట్ గెలిచింది. దక్షిణాఫ్రికా రెండో టెస్టులో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ సమం అయింది.
ఇక ప్రస్తుతం జరుగుతున్న 3 t20 మ్యాచ్ సిరీస్లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది.. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా 55 పరుగులతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హెన్ రిక్స్ 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నవాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలింది. సయీం ఆయుబ్ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నవాజ్ 36, ఫర్హాన్ 24 పరుగులు చేశారు. బాబర్ 0, కెప్టెన్ సల్మాన్ అఘా 2, నవాజ్ 3, అష్రాఫ్ 1, అఫ్రిది 4 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా బాబర్ సున్నా పరుగులు చేయడంతో అతని మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..”బాబర్ నీ కథ ముగిసిపోయిందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.