Homeక్రీడలుBabar Azam: షాహిన్ సహా అంతా ప్లాప్.. పాకిస్థాన్ కు మళ్ళీ బాబర్ దిక్కయ్యాడా?

Babar Azam: షాహిన్ సహా అంతా ప్లాప్.. పాకిస్థాన్ కు మళ్ళీ బాబర్ దిక్కయ్యాడా?

Babar Azam: అనిశ్చిత క్రికెట్ కు మారుపేరైన పాకిస్తాన్ జట్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ మళ్లీ సారధ్య బాధ్యతలు స్వీకరించాడు. మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుకు అతడు నాయకత్వం వహించలన్నాడు. టి20 మాత్రమే కాకుండా వన్డే ఫార్మాట్ కు అతడే కెప్టెన్ అయ్యాడు. భారత్ వేదికగా ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. దానికి బాధ్యత వహిస్తూ బాబర్ అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యత నుంచి వైదొలిగాడు.

మెగా టోర్నీలలో ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన జట్టు కెప్టెన్లను మార్చుతూ ఉంటుంది. గతంలో సంఘటనలు చాలా జరిగాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించినప్పుడు బాబర్ పై కూడా చర్యలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. వాటికంటే ముందే బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అప్పట్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు బాబర్ కు వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపించాయి.

అయితే ఇటీవల పాకిస్తాన్ ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. పైగా జట్టులో వర్గాలు ఏర్పడ్డాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో పాకిస్తాన్ బోర్డులో మార్పులు చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. జకా ఆశ్రఫ్ స్థానంలో చైర్మన్ గా మోహిసిన్ రజా బాధ్యతలు స్వీకరించాడు. దీంతోపాటు కెప్టెన్సీ విషయంలోనూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మరి కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో బాబర్ కు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

వన్డే వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శన అనంతరం బాబర్ తప్పుకోవడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెస్టుల్లో షాన్ మసూద్, టి20 ఫార్మాట్ లో షాహిన్ ఆఫ్రిదికి కెప్టెన్సీ బాధిత అప్పగించింది. వన్డే ఫార్మాట్ లో ఎవరనేది స్పష్టం చేయలేదు. అయితే వారిద్దరు కూడా సారధులుగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ లో ఒక విజయం కూడా పాకిస్తాన్ జట్టు నమోదు చేయలేకపోయింది. న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ ను కోల్పోయింది. ఇన్ని వరుస వైఫల్యాలతో పాకిస్తాన్ జట్టు యాజమాన్యం అనేక ప్రణాళికలు రచించింది. ఆఫ్రిదిని నాయకత్వ బాధ్యత నుంచి పక్కన పెట్టింది. వరల్డ్ కప్ లో సారధ్య బాధ్యతను బాబర్ కు కట్టబెట్టింది. ఒకానొక దశలో కెప్టెన్సీ రేసులో బాబర్ తర్వాత రిజ్వాన్ కూడా ఉన్నాడు. అనుభవం దృష్ట్యా బాబర్ వైపే బోర్డు పెద్దలు మొగ్గు చూపారు. కాగా ఈ టి20 వరల్డ్ కప్ ను అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జూన్ రెండున్న ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. జూన్ 5న భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version