Axar Patel: టి20లో ప్రయోగాలు చేయాలి. కాకపోతే ఆ ప్రయోగాలు జట్టుకు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలి. అలా కాకుండా ఆ ప్రయోగం విఫలమై మొదటికే మోసం చేస్తే దానిని ఏమనాలి? ప్రస్తుతం టీమిండియాలో గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పై విధంగా ఉన్నాయి. ఇప్పటికే టెస్టులలో టీమిండియా దారుణమైన ఓటములను మూట కట్టుకుంటున్నది. స్వదేశంలో రెండు వైట్ వాష్ లకు గురై పరువు తీసుకున్నది. ఇప్పుడు ఇదే వ్యవహారం టి20 లో కూడా కొనసాగే ప్రమాదం కనిపిస్తోంది. దీని అంతటికి ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చండీగఢ్ వేదికగా జరిగిన రెండవ టి20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.. డ్యూ ఉండడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు.. భారత బౌలర్లు పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. బుమ్రా నుంచి అర్ష్ దీప్ సింగ్ వరకు దారుణంగా పరుగులు ఇచ్చారు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఇంతటి భారీ స్కోర్ చేజ్ చేసే సమయంలో టీమిండియా తడబాటుకు గురైంది. గిల్(0) మరోసారి నిరాశపరచాడు. సూర్య కుమార్ యాదవ్ (5) తనకు అలవాటైన నిర్లక్ష్యాన్ని కొనసాగించాడు. అభిషేక్ శర్మ (17) మెరుపులు చివరి వరకు కొనసాగలేదు.
టీమిండియా 19 పరులకే రెండు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో అనూహ్యంగా మైదానంలోకి అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు వచ్చాడు.. ప్రారంభం నుంచి అవుట్ అయ్యేవరకు అతడు దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. వాస్తవానికి ఈ స్థానంలో తిలక్ వర్మను పంపించి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఎందుకంటే కీలకవర్మ మూడో నెంబర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు.. ఒకవేళ అతనిని కాకుండా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను పంపించినా బాగానే ఉండేది. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మేనేజ్మెంట్ ఊహించని విధంగా అక్షర్ పటేల్ ను పంపించి మూల్యం చెల్లించుకుంది. అతడు 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు. చెప్పడానికి ఇది బాగానే ఉన్నప్పటికీ.. టి20 బంతికి ఒక పరుగు చొప్పున తీస్తే జట్టు విజయం సాధించదు.
ఎలాంటి ప్రయోజనం ఆశించి మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది? దీనివల్ల జట్టుకు లభించిన ప్రయోజనం ఏముంది? అసలు మూడో నెంబర్లో అక్షర్ ను పంపించాల్సిన అవసరం ఏముంది? టి20 లో వికెట్ల కంటే పరుగులకే ఎక్కువ విలువ ఉంటుంది. అలాంటప్పుడు అక్షర్ ను పంపించడం వెనక ఆంతర్యం ఏముంది? ఈ ప్రశ్నలకు మేనేజ్మెంట్ ఎలాంటి సమాధానం చెప్పినా ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు అంతగా సంతృప్తి చెందరు. ఎందుకంటే దక్షిణాఫ్రికా బ్యాటర్లు పరుగులను స్వేచ్ఛగా తీసిన మైదానంలో.. టీమిండియా బ్యాటర్లు విఫలం కావడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా అక్షర్ పటేల్ ను మూడో స్థానంలో పంపించడం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు.