Axar Patel: నాడు నవ్వారు కదరా.. ఇప్పుడు చూడండి ఇండియాను ఎలా గెలిపించాడో?

2022 t20 వరల్డ్ కప్ లో అడిలైడ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పై బట్లర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. బ్రూక్ తో కలిసి టీమిండియా విధించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని సులువుగా చేదించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 11:32 am

Axar Patel

Follow us on

Axar Patel: “అతడిని ఎందుకు ఎంపిక చేశారు.. ఐపీఎల్ లో మరీ అంత గొప్పగా ప్రభావం చూపించలేకపోయాడు కదా.. అతని కంటే గొప్ప గొప్ప బౌలర్లు ఉన్నారు. వారందరిని పక్కనపెట్టి ఇతని వైపే ఎందుకు మొగ్గు చూపించారు. అవకాశాలు అందరికీ ఇవ్వకుండా.. కొందరికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు. ఇలాంటి ఆటగాళ్లతో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందా? ఒకసారి సెలెక్టర్లు ఆలోచించాలి.. అతని విషయంలో పునరాలోచించాలి” అక్షర్ పటేల్ ను టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసినప్పుడు.. క్రీడా విశ్లేషకులు చేసిన విమర్శలవి.. ఆ విమర్శలను సెలెక్టర్లు పట్టించుకోలేదు.. కానీ అక్షర్ పటేల్ మైండ్ లోకి గట్టిగా ఎక్కించుకున్నాడు.. విమర్శించిన వాళ్లకు, ప్రశ్నించిన వాళ్లకు, ఎగతాళి చేసిన వాళ్లకు, గేలి చేసిన వాళ్లకు తన ఆట తీరుతోనే సమాధానం చెప్పాలని బలంగా నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే తన ఆట తీరుతో సమాధానం చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టుతో చావో రేవో తేలాల్సిన మ్యాచ్లో.. బంతిని గింగిరాలు తిప్పాడు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను తన బౌలింగ్ మాయాజాలంతో వణికించాడు.

2022 t20 వరల్డ్ కప్ లో అడిలైడ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పై బట్లర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అలేక్స్ హేల్స్  తో కలిసి టీమిండియా విధించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని సులువుగా ఛేదించాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు కన్నీటిని మిగిల్చాడు. గురువారం నాటి సెమీఫైనల్ మ్యాచ్ లోనూ బట్లర్(15 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 23) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో అభిమానుల్లో 2022 నాటి సీన్ రిపీట్ అవుతుందనే భయం ఏర్పడింది. తొలి మూడు ఓవర్లలోనే ఇంగ్లాండ్ స్కోర్ ను అతడు 26 పరుగుల దాకా తెచ్చాడు. దీంతో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ అక్షర్ ను రంగంలోకి దింపాడు. అక్షర్ వేసిన తొలి బంతిని సరిగ్గా అంచనా వేయలేక ముందుకొచ్చి ఆడాడు. అది బ్యాట్ ఎడ్జ్ తగిలి కీపర్ రిషబ్ పంత్ చేతుల్లో పడింది. దీంతో ఒక్కసారిగా టీమిండియా ఊపిరి పీల్చుకుంది.. బట్లర్ వికెట్ పడగొట్టి టీమ్ ఇండియాలో ఉత్సాహం నింపాడు అక్షర్.. ఇదేవిధంగా మొయిన్ అలీ (8), జానీ బెయిర్ స్టో(0) ను పెవిలియన్ పంపించాడు. ప్రమాదకరమైన లివింగ్ స్టోన్ ను రన్ అవుట్ చేశాడు. ఇలా కీలకమైన నాలుగు వికెట్లను పడగొట్టడం ద్వారా టీమ్ ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు.

గయానా వేదికపై అప్పటికే రెండుసార్లు వర్షం కురవడంతో మైదానంపై కాస్త తేమ ఉంది. ఈ తేమను అక్షర్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. బంతిని గింగిరాలు తిప్పుతూ ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్ లోనూ అక్షర్ పటేల్ సత్తా చాటాడు. ఆరు బంతుల్లో పది పరుగులు చేసి.. వేగంగా ఆడే క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో ఒక భారీ సిక్సర్ కూడా ఉంది.. అటు బంతి, ఇటు బ్యాట్ తో రాణించిన నేపథ్యంలో.. అక్షర్ పటేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.