Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్నారు. శనివారం(జూన్ 29న) కొండగట్టుకు వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. 11 రోజులపాటు ఆయన ఈ దీక్షలోనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తన ఇష్టదైవం అయిన కొండగట్టు దర్శనం కూడా చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
అంజన్న దీవెనతోనే…
పవన్ కళ్యాణ్ మొదటి నుంచి హనుమాన్ భక్తుడు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు మొదటిసారి కొండగట్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బస్సుకు విద్యుత్ తీగలు తగిలాయి. అయితే పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు భావించారు. ఇక గతేడాది ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రథం తయారు చేయించుకున్నారు. దానికి వారాహి అమ్మవారి పేరు పెట్టారు. వాహనానికి కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన తర్వాతనే ప్రచారం చేశారు.
డిప్యూటీ సీఎం హోదాలు..
ఇప్పటి వరకు రెండుసార్లు కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాన్ ఒకసారి ప్రజారాజ్యం నేతగా, మరోసారి జనేసేన అధినేతగా వచ్చారు. ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు రాబోతున్నారు. ఈమేరకు కార్యకర్తలు హడావుడి చేస్తున్నారు. తమ అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి హోదాలో రాబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.
ధ్రువీకరించని ఆలయ ఈవో..
ఇదిలా ఉండగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కొండగట్టు పర్యటనపై అటు జన సేన పార్టీ నుంచిగానీ, ఇటు ఏపీ ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి ప్రకటన రాలేదు. కొండగట్టు ఆలయానికి కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని ఈవో చంద్రశేఖర్ తెలిపారు.