Australia beat England: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా.. ఈ సామెత ఇంగ్లాండ్ జట్టుకు నూటికి నూరు శాతం సరిపోతుంది. అద్భుతంగా బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఉన్నారు. అమోగంగా బౌలింగ్ వేసే బౌలర్లు ఉన్నారు. సూపర్ మెన్ తరహాలో ఫీలింగ్ చేసే ఫీల్డర్లు కూడా ఉన్నారు. ఇన్ని ఉన్నప్పటికీ ఇంగ్లాండు ప్లేయర్లకు సిరీస్ దక్కలేదు. ప్రతిష్టాత్మంగా “బూడిద” సొంతం కాలేదు..
గత ఏడాది టీమిండియాతో స్వదేశం వేదికగా ఇంగ్లాండ్ జట్టు 5 టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో భారత్ బలమైన పోటీ ఇవ్వడంతో.. డ్రా అయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. యాషెస్ సిరీస్ లో భాగంగా కంగారు జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు కోల్పోయింది. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయం సాధించినప్పటికీ.. అంతకుముందు వరుసగా మూడు టెస్టులలో ఓటమిపాలైంది. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయం సాధించిన తర్వాత.. సిడ్నీ టెస్టులో కూడా గెలుపు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. పైగా సిడ్నీ టెస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్లు సమర్ధవంతంగా బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేసింది. రూట్(160) సెంచరీ తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 567 పరుగులు చేసింది. హెడ్(163), స్మిత్(138) సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో వెబ్ స్టర్(71*) హాఫ్ సెంచరీ చేశాడు.. కార్స్, టంగ్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.
రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 342 పరుగులు చేసింది. బెతల్ (150) పరుగులు చేశాడు. అతడు అవుట్ కాగానే ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. తద్వారా ఆస్ట్రేలియా జట్టు ముందు 161 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది ఇంగ్లాండ్ జట్టు. దీనిని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా జట్టు. తద్వారా యాషెస్ సిరీస్ ను 4-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టు కోల్పోయింది. వాస్తవానికి తొలి మూడు టెస్టులలో ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్ట్ లో విజయం సాధించిన తర్వాత.. ఇంగ్లాండ్ జట్టు సిడ్నీ టెస్ట్ కూడా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా జట్టు ముందు ఇంగ్లాండ్ జట్టు పప్పులు ఉడకలేదు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ అంటే చాలామంది బోర్ అనుకుంటున్న నేటి రోజుల్లో.. ఐదు టెస్టులు కూడా రసవత్తరంగా జరిగేలా ఇరుజట్ల ప్లేయర్లు కృషి చేశారు. ఈ సిరీస్లో ఒక్క టెస్ట్ కూడా డ్రా కాకపోవడం విశేషం.