Pawan to visit Pithapuram: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆయన పిఠాపురానికి చేరుకుంటారు. అయితే ఇకనుంచి పిఠాపురం వేదికగా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సొంతంగా ఇంటిని కూడా నిర్మించుకుంటున్నారు. పిఠాపురంలో శాశ్వత నియోజకవర్గం గా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు సంక్రాంతి ముందస్తు సంబరాల కోసం పిఠాపురం వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ మూడు రోజులపాటు జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అయితే గ్రామీణ సాంప్రదాయ కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడంతో మూడు రోజులపాటు పిఠాపురం ప్రత్యేకంగా నిలవనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రతి వేడుక అక్కడే
2024 లో అధికారంలోకి వచ్చింది కూటమి. పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి ప్రతి వేడుకను పిఠాపురంలో నిర్వహించడం పవన్ కళ్యాణ్ కు ఆనవాయితీగా మారింది. చివరకు ప్రత్యేక పర్వదినాల్లో తాను అందుబాటులో లేకపోతే… కుటుంబ సభ్యులను అక్కడకు పంపించి కార్యక్రమాలను జరిపిస్తున్నారు. మొన్న ఆ మధ్యన నాగబాబు భార్య మహిళలతో కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా చీరలు పంపిణీ చేశారు. మరోవైపు పిఠాపురంలో జనసేన సమన్వయానికి ఐదుగురు సభ్యులకు కూడిన బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరికి బాధ్యతలు అప్పగించకుండా అందరికీ భాగస్వామ్యం కల్పించి.. విభేదాలకు తావు లేకుండా చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా..
మూడు రోజులపాటు పిఠాపురం రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకుంటారు. మొన్న వరదలకు ముంపు బారిన పడిన ప్రాంతాలను సందర్శిస్తారు. వాటికి సంబంధించి పరిష్కార మార్గాలను అధికారులతో చర్చించి ఒక కొలిక్కితేనున్నారు. అయితే అలనాటి జానపదాలు, సాము గారడీలు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పిఠాపురం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూడు రోజులపాటు వివిధ రాష్ట్రాల కళాకారులు సైతం రానున్నారు. పురాతన క్రీడలకు సంబంధించి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తానికైతే పిఠాపురంలో రెండో ఏడాది సంక్రాంతి సంబరాలకు పవన్ హాజరవుతుండడం విశేషం.