Australia Vs England 1st Test Ashes: యాషెస్ సిరీస్.. పేరుకు టెస్ట్ సిరీస్ అయినప్పటికీ యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఈ సిరీస్లో కొంతకాలంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మీద పై చేయి సాధిస్తోంది. అయితే ఈసారి ఆస్ట్రేలియాకు బ్రేక్ వేయాలని.. తాము సత్తా చాటాలని ఇంగ్లాండ్ జట్టు బలంగా భావించింది. ఇందులో భాగంగానే పకడ్బందీ ప్లేయర్ల బృందంతో కంగారు గడ్డమీద అడుగుపెట్టింది. పెర్త్ వేదిక గా జరుగుతున్న తొలి టెస్టులో హెజిల్ వుడ్, కమిన్స్ లేకపోవడంతో పండగ చేసుకోవచ్చని ఇంగ్లాండ్ బ్యాటర్లు అనుకున్నారు. కానీ వారి అంచనాల మీద నీళ్లు చల్లాడు స్టార్క్.
ఆస్ట్రేలియా జట్టు టాస్ ఓడిపోయినప్పటికీ… ఇంగ్లాండ్ జట్టు దూకుడు కొనసాగించనీయకుండా చేశాడు స్టార్క్.. దుమ్ము రేపే రేంజ్ లో బౌలింగ్ వేసాడు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 32.5 ఓవర్లలోనే 172 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఇందులో ఏకంగా 12 ఓవర్లను స్టార్క్ వేశాడంటే అతని మీద ఆస్ట్రేలియా జట్టుకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతిబంతిని 140 కిలోమీటర్ల వేగానికి మించి వేశాడు. అంతేకాదు ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతి బంతిని స్వింగ్ చేశాడు. ఫలితంగా క్రావ్ లే నుంచి మొదలు పెడితే స్టోక్స్ వరకు ఏడుగురు ప్లేయర్లు స్టార్క్ బౌలింగ్లో ఔట్ అయ్యారు.
స్టార్క్ ఈ స్థాయిలో బౌలింగ్ వేస్తాడని ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు ఊహించి ఉండరు. అయినప్పటికీ పెర్త్ పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న స్టార్క్.. అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మరో బౌలర్ కు అవకాశం ఇవ్వకుండా.. 10 వికెట్లలో 7 తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పెర్త్ పిచ్ మీద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టు ఏ ఒక్క ఆటగాడి మీద ఆధారపడదు అంటారు. కానీ పెర్త్ టెస్టులో మాత్రం దానిని తప్పు అని నిరూపించాడు స్టార్క్. అతడు ఈ స్థాయిలో బౌలింగ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించావని ఆస్ట్రేలియా అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. హేజిల్ వుడ్, కమిన్స్ గాయాల వల్ల ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.