IND VS NZ Test Match : సిరీస్ లో నిలవాలంటే విరుచుకుపడాల్సిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్లకు దాసోహం అయ్యారు. 156 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. టర్నింగ్ వికెట్ పిచ్ పై ఆడలేక ఆపసోపాలు పడ్డారు. దారుణమైన షాట్లు ఆడుతూ వికెట్లు పోగొట్టుకున్నారు. ఫలితంగా పై చేయి సాధించాల్సిన వేళ టీమిండియా 156 పరుగులకే డ్రెస్సింగ్ రూమ్ చేరుకుంది. న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సాంట్నర్ (7/53) కెరియర్ లోనే అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. అంతేకాదు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. రెండవ న్యూజిలాండ్ కెప్టెన్ లాతం (86), వికెట్ కీపర్ బ్లండల్ (30*) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు..
స్పిన్ బౌలర్ల పైచేయి
రెండవ టెస్టులో తొలి రోజు భారత్ పై చేయి సాధించగా.. రెండవ రోజు న్యూజిలాండ్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. స్థూలంగా చూస్తే రెండు రోజులు స్పిన్ బౌలర్లు సత్తా చాటారు.. వాస్తవానికి స్పిన్ బాణాన్ని న్యూజిలాండ్ జట్టు మీదికి సంధించాలని భావించిన టీమిండియా.. అదే బాణం తన మీదికి తిరిగి రావడంతో నిల్వలేకపోయింది. వాస్తవానికి పూణే మైదానంపై బంతి టర్న్ అవుతున్నప్పటికీ.. భారత ఆటగాళ్లు నిర్లక్ష్యంగా షాట్లు ఆడి పెవిలియన్ చేరుకున్నారు. దీంతో భారీ లీడ్ సాధించాలనుకున్న రోహిత్ సేన ఆశలు మొత్తం అడియాసలయ్యాయి. ఫలితంగా పర్యాటక జట్టు తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తోంది.
సుందర్ మళ్లీ వికెట్ల వేట..
తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు సాధించిన సుందర్.. రెండవ ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. ముందుగా కాన్వే(17) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ విల్ యంగ్(23) ను పెవిలియన్ పంపించాడు. రచిన్ రవీంద్ర (9), మిచెల్(18) ను సుందర్ వెనక్కి పంపించాడు. ఈ దశలో లాతం(86) జిడ్డు లాగా క్రీజ్ లో అలానే ఉండిపోయాడు. బ్లండెల్ (30) తో కలిసి కీలక పార్ట్నర్ షిప్ నెలకొల్పాడు. ఐదో వికెట్ కు ఏకంగా 60 పరుగులు జోడించాడు. ఈ జోడిని సుందర్ విడదీశాడు. లాతమ్ ను వికెట్ల ముందు సుందర్ దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఫిలిప్స్ (9*) వచ్చాడు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 198 రన్స్ చేసింది. మొత్తంగా 301 పరుగులకు లీడ్ పెంచుకుంది. ఈ టెస్టులో టీమిండియా ఓటమిని తప్పించుకోవాలంటే భారత బ్యాటర్లు ఆకాశమేహద్దుగా చెలరేగాలి. లేకుంటే బెంగళూరు ఫలితమే ఇక్కడా వస్తుంది.