Tirumala Tirupati Devasthanam : తిరుమల వచ్చే భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తోంది టీటీడీ. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు సురక్షితంగా ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా తిరుమలలో అనారోగ్యానికి గురైన.. అస్వస్థతకు గురైన వారి విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. అటువంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచనలు చేసింది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు సైతం నడక మార్గంలో రావద్దని సూచిస్తోంది. ఒకవేళ రావాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యసదుపాయాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో ప్రత్యేక ప్రకటన జారీ చేసింది టీటీడీ. ఇటీవల అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకుంటున్న చాలామంది భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. వారి అనారోగ్య సమస్యలను మరింత పెంచుకుంటున్నారు. అయితే ఇలా వస్తున్న భక్తులు మార్గంలో పడుతున్న ఇబ్బందులను దృష్ట్యా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారికోసం కీలక సూచనలు చేసింది.
* వారి విషయంలో కీలక సూచనలు
చాలామంది వృద్ధులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అయితే 60 ఏళ్లు దాటిన వృద్ధులు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావద్దని టీటీడీ సూచించింది. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు వాహనాల్లో మాత్రమే కొండపై చేరుకోవాలని సూచించింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా తమతో మందులు తెచ్చుకోవాలని కూడా ప్రత్యేక సూచనలు ఇచ్చింది టీటీడీ.
* ఆక్సిజన్ స్థాయి తక్కువ
వాస్తవానికి తిరుమల కొండ సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. దానికి కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. సహజంగా కాలినడకన వచ్చేవారు వేలాది మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఒత్తిడితో వారు సతమతమవుతారు. ఆ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరోవైపు ఇటువంటి వారి కోసం అలిపిరి కాలిబాట మార్గంలో 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది టీటీడీ. అలాగే భక్తుల కోసం తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఇతర ఆసుపత్రుల్లో 24 గంటల వైద్య సదుపాయాలను సైతం అందుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అటు స్విమ్స్ ఆసుపత్రిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సౌకర్యం సైతం అందుబాటులోకి తెచ్చినట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అయితే కాలినడకన తిరుమల చేరుకునే వారి విషయంలో టిటిడి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం విశేషం