Asia Cup: ఆసియా కప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. యూఏఈ వేదికగా జరిగే ఈ సిరీస్ లో మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. క్రితం జరిగిన ఆసియా కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో .. టైటిల్ ఫేవరెట్ గా సూర్య కుమార్ యాదవ్ సేన బరిలోకి దిగుతోంది.
ఆసియా కప్ అనగానే అందరి దృష్టి భారత్ , పాకిస్తాన్ జట్ల మీద ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు జట్లు చిరకాల ప్రత్యర్ధులు. పైగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ రెండు జట్లు తలపడతాయా? తలపడే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతున్నాయి. ఇటీవల పహల్గాం అటాక్ తర్వాత భారతదేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏ క్రీడా అంశమైన సరే పాకిస్తాన్ తో ఆడేది లేదని స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సిరీస్ లలో తలపడేది లేదని పేర్కొంది. దీంతో ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ తలపడే విషయంపై మీమాంస నెలకొంది. దీనిపై భారత క్రికెట్ బోర్డు పెద్దలు స్పష్టత ఇచ్చారు.
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. భారత క్రీడా సాధికార సంస్థ వెల్లడించిన నిబంధనల ప్రకారం.. పాకిస్తాన్ జట్టుతో ఎట్టి పరిస్థితుల్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదు. కాకపోతే అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే గ్లోబల్ టోర్నీలో మాత్రమే భారత్, పాకిస్తాన్ తలపడతాయి. తటస్థ వేదికల మీద మాత్రమే భారత ఆడుతుంది. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ భారత్ ఆడదు. ఆసియా కప్ లో కూడా ఇదే జరుగుతుంది.. ఇటీవల లెజెండ్స్ క్రికెటర్ టోర్నీ జరిగినప్పుడు భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో తలపడలేదు. సెమి ఫైనల్ మ్యాచ్లో ఆడేందుకు ఆసక్తిని చూపించలేదు. దీంతో దాయాది జట్టు ఫైనల్ వెళ్లిపోయినప్పటికీ.. తుది పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.
ఇప్పుడు ఆసియా కప్ విషయంలో కూడా అవే చర్చలు తెరపైకి వస్తున్నాయి. లెజెండ్స్ దాయాది జట్టుతో క్రికెట్ ఆడలేదు కాబట్టి.. ఆసియా కప్ లో కూడా అదే ధోరణి కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం విరుద్ధంగా జరుగుతోంది. పాకిస్తాన్ జట్టుతో ఆసియా కప్ లో తలపడేది తద్యమని భారత క్రికెట్ నియంత్రణ మండలి పేర్కొంది. మరోవైపు పహల్గాం దాడి తర్వాత రెండు దేశాలు పరస్పరం తలపడుతున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ తలపడతాయి.