Asia Cup 2023: ఆసియా కప్–2023ను వరుణ గండం వెంటాడుతోంది. ఇప్పటికే భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా సాగలేదు. ప్రస్తుతం సిరీస్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిసి సూపర్ 4 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక మ్యాచ్ సాఫీగానే సాగింది. అయితే శ్రీలంక వేదికగా జరుగబోయే మ్యాచ్‌లకు మాత్రం వరుణుడు అడ్డు పడుతున్నాడు.
ఇంకా ఐదు మ్యాచ్‌లు..
సూపర్ 4లో మిగిలి ఉన్న ఐదు మ్యాచ్ లు కూడా శ్రీలంకలోని కోలంబో వేదికగా జరగనున్నాయి. ఇందులో భారత్, శ్రీలంక జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెండేసి మ్యాచ్‌లు ఆడాలి. వచ్చే 15 రోజుల పాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో సూపర్ 4 మ్యాచ్ లపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
మ్యాచ్‌లన్నీ రద్దయితే..
ఇకపై జరిగే సూపర్ 4 మ్యాచ్ లన్నీ వర్షం కారణంగా రద్దయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏ జట్లు ఫైనల్స్ కు చేరతాయి అనే అనుమానాలు చాలా మంది అభిమానుల్లో కలిగే ఉంటుంది. పాకిస్తాన్ ఇప్పటికే 2 పాయింట్లతో ఉంది. సెప్టెంబర్ 10న భారత్ తో.. సెప్టెంబర్ 14న శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే అప్పుడు పాకిస్తాన్∙ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. దాంతో పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంటుంది. అదే సమయంలో.. భారత్, శ్రీలంక జట్లు ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు రద్దయితే అప్పుడు ఆ రెండు జట్ల ఖాతాలో మూడేసి పాయింట్ల చొప్పున చేరతాయి. నెట్ రన్‌రేట్ కూడా సమంగా ఉంటాయి.
రూల్స్ ఇవీ..
ఇటువంటి సమయంలో టాస్ ద్వారా ఫైనల్ కు చేరే రెండో జట్టును నిర్ణయిస్తారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య టాస్ వేస్తారు. అందులో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ కు చేరతారు. విచిత్రంగా ఉంది కదూ. కానీ ఐసీసీ రూల్ ఇదే చెబుతుంది.